- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి పరకామణిలో 'భారీ చోరీ' వార్తలు అవాస్తవం : టీటీడీ స్పష్టత
తిరుమల శ్రీవారి పరకామణిలో భారీగా బంగారం చోరీ జరిగిందంటూ మంగళవారం ఒక దిన పత్రికలో ప్రచురితమైన కథనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఖండించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల శ్రీవారి పరకామణిలో భారీగా బంగారం చోరీ జరిగిందంటూ మంగళవారం ఒక దిన పత్రికలో ప్రచురితమైన కథనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఖండించింది. ఆ వార్తల్లో పేర్కొన్న అంశాలు పూర్తిగా అసత్యమని, వాస్తవాలను వక్రీకరించి భక్తులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని టీటీడీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. గతేడాది జనవరి 11న పరకామణిలో విధులు నిర్వర్తిస్తున్న పెంచలయ్య అనే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది 100 గ్రాముల బంగారు బిస్కట్‌ను అపహరించేందుకు ప్రయత్నించగా, టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలను అప్పట్లోనే సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.
పోలీసు విచారణ - రికవరీ వివరాలు..
దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడి ఇల్లు, ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి.. 555.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 157 గ్రాముల వెండి వస్తువులు, పోలీసు కస్టడీ సమయంలో మరో 76 గ్రాముల బంగారు ఆభరణాలు, ప్రముఖ జ్యూవెలరీ దుకాణాల్లో బంగారం మార్పిడి చేసినట్లుగా ఉన్న ఇన్‌వాయిస్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పోలీసులు 12 మంది సాక్షులను విచారించి, పక్కా ఆధారాలతో కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో విచారణలో ఉందని, తదుపరి విచారణ ఏప్రిల్ 13న జరగనుందని టీటీడీ తెలిపింది.
భద్రతపై భరోసా..
పరకామణి ప్రక్రియ అంతా అత్యున్నత స్థాయి భద్రత నడుమ జరుగుతుందని టీటీడీ పేర్కొంది. బహుళస్థాయి భద్రతా వ్యవస్థ, నిరంతర సీసీటీవీ పర్యవేక్షణ, కఠినమైన నియంత్రణలు అమలులో ఉన్నాయని స్పష్టం చేసింది. గతంలో జరిగిన ఘటనను వక్రీకరించి, ఇప్పుడు కోట్లాది రూపాయల బంగారం మాయమైందంటూ ప్రచారం చేయడం నిరాధారమని కొట్టిపారేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలను భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.






