మెడకు ఉరి తాళ్లతో గిరిజనుల నిరసన

by Thanuru Gopichand |

తమను పట్టించుకోవడం లేదంటూ గిరిజనుల వినూత్న నిరసన.

మెడకు ఉరి తాళ్లతో గిరిజనుల నిరసన
X

దిశ, వెబ్ డెస్క్ : విజయనగరం జిల్లాలోని గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలో గల గిరిజన గ్రామాలు తమ ఉనికి కోసం పోరాడుతున్నాయి. కృపా వలస, రమణ వలస, దీవెన వలస, సీయోను వలస, చిన్నాకిన వలస వంటి ఐదు గ్రామాలకు చెందిన సుమారు 100 గిరిజన కుటుంబాలు అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో వినూత్న నిరసన చేపట్టాయి. తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ.. గ్రామస్థులందరూ తమ మెడలకు ఉరితాళ్లు బిగించుకొని నిరసన వ్యక్తం చేశారు. కనీస మౌలిక సదుపాయాలు లేక, అటు ట్రైబల్ అధికారులు కానీ, ఇటు స్థానిక పాలకులు కానీ కనీసం తమ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బతుకులు గాలిలో దీపాల్లా మారాయని, న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

​ఈ నిరసనలో భాగంగా గిరిజనులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలను చేతబూని తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమను ఆదుకునే వారు లేరని, కనీసం పవన్ కళ్యాణ్ అయినా స్పందించి తమ గ్రామాల అభివృద్ధికి చొరవ చూపాలని వారు వేడుకున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు ఇచ్చినా ఫలితం లేదని, గిరిజన సంక్షేమ అధికారులు తమ ఉనికినే గుర్తించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఆధార్, రేషన్ కార్డులను అందించాలని కోరుతున్నారు. అంతేకాకుండా తమ గ్రామాలకు మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. ప్రాణాలకు తెగించి మెడకు ఉరితాళ్లతో నిరసన తెలుపుతున్న ఈ గిరిజన ప్రాంత ప్రజల ఆవేదన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ ఐదు గ్రామాలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Next Story