అనకాపల్లి జిల్లాలో భూప్రకంపనలు.. రిక్టర్‌ స్కేల్‌పై 3.7 తీవ్రతగా నమోదు

by Kema Shiva Kumar |

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పరిసరాల్లో అర్ధరాత్రి భూప్రకంపనలు సంభవించాయి.

అనకాపల్లి జిల్లాలో భూప్రకంపనలు.. రిక్టర్‌ స్కేల్‌పై 3.7 తీవ్రతగా నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు భయోత్పాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా అనకాపల్లి (Anakapally) జిల్లాలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ భూప్రకంపనలు సంభవించాయి. ముఖ్యంగా రాంబిల్లి (Rambilli) మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. ఈ ప్రకంపనలు కొన్ని సెకన్ల పాటు కొనసాగాయి. రిక్టర్‌ స్కేల్‌ (Richter Scale)పై ఈ భూకంప తీవ్రత 3.7గా నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. గాఢనిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భూమి కంపించడంతో ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

తీర ప్రాంతంలో ఆందోళన..

రాంబిల్లి మండలం తీర ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో ప్రకంపనల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇళ్లలోని సామాన్లు కిందపడటం, కిటికీలు కదలడంతో జనం భయంతో వీధుల్లోనే గడిపారు. అయితే, ఈ ప్రకంపనల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లుగా ఇప్పటి వరకు సమాచారం అందలేదు. తక్కువ తీవ్రతే అయినప్పటికీ, మళ్లీ ప్రకంపనలు వస్తాయేమోనన్న ఆందోళనలో స్థానికులు ఉన్నారు. జిల్లా యంత్రాంగం పరిస్థితిని గమనిస్తోంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story