"పక్కనవాడు చస్తే మనకేం?".. ఈ ఆలోచనే 19 మందిని చంపింది.. కర్నూలు బస్సు ప్రమాదంలో బయటపడ్డ టాప్ సీక్రెట్

by Naga Rani Yarlagadda |

కర్నూల్ బస్సు ప్రమాదానికి కారణం డ్రైవర్ లక్ష్మయ్య ఒక్కడే కారణం కాదు. అతను చెప్పిన విషయాలు తెలిశాక మరో టాప్ సీక్రెట్ బయటపడింది.

పక్కనవాడు చస్తే మనకేం?.. ఈ ఆలోచనే 19 మందిని చంపింది.. కర్నూలు బస్సు ప్రమాదంలో బయటపడ్డ టాప్ సీక్రెట్
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూల్ జిల్లా చిన్నటేకూరు గ్రామానికి సమీపంలో నేషనల్ హైవే 44పై జరిగిన బస్సు ప్రమాద ఘటనకు కారకులెవరన్నదానిపై ఒక స్పష్టత వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 24వ తేదీ తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ కు చెందిన ఏసీ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగి రెండ్రోజులైనా మృతుల డెడ్ బాడీలు ఇంకా కుటుంబాలకు అందజేయలేదు. గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో డీఎన్ఏ పరీక్షల ఆధారంగానే గుర్తించాల్సి ఉందని, రిపోర్టులు రావడానికి 48 గంటల సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.

ప్రమాదం జరగ్గానే బస్సు డ్రైవర్ లక్ష్మయ్య పరారవ్వడంతో అందరం డ్రైవరే ప్రమాదానికి బాధ్యుడని, బైకర్ సహా 20 మంది ప్రాణాలు తీశాడంటూ ముద్ర వేసేశాం. ప్రస్తుతం అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో లక్ష్మయ్య చెప్పిన విషయాలను పరిశీలిస్తే.. ఇక్కడ తప్పు అతనొక్కడిదే కాదని స్పష్టంగా తెలుస్తోంది. కావేరీ ట్రావెల్స్ బస్సు కంటే ముందు మరో రెండు వాహనాలు ఆ దారిలోనే వెళ్లాయి. రోడ్డుకు అడ్డంగా ఉన్న బైకును గానీ, చలనం లేకుండా పడి ఉన్న శివశంకర్ ను గానీ వాళ్లు పట్టించుకోలేదు.

డ్రైవర్ లక్ష్మయ్య చెప్పిన వివరాలివి..

హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రయాణికులతో వెళ్తుండగా భారీ వర్షం కురిసిందని లక్ష్మయ్య తెలిపాడు. ఆ వర్షానికి రోడ్డుపై నలుపు రంగులో ఉన్న బైక్ తనకు దూరం నుంచి కనిపించలేదని, దగ్గరగా వచ్చాక కనిపించిందని చెప్పాడు. అప్పటికి బస్సును స్పడ్ గా నడుపుతుండటంతో పాటు వెనుక కూడా వాహనాలు వస్తున్నాయని, ఆ సమయంలో బ్రేక్ వేస్తే.. ఆ వాహనాలు బస్సును ఢీ కొట్టి భారీ ప్రమాదం జరుగుతుందని ఊహించి తప్పనిసరి పరిస్థితుల్లో బైక్ పై నుంచే బస్సును తీసుకెళ్లానని చెప్పాడు. తనకంటే ముందు రెండు, మూడు బస్సులు ఆ బైక్ ను తప్పించుకుని వెళ్లాయని చెప్పాడు.

మానవత్వం మంటగలిసిపోయిందా?

డ్రైవర్ లక్ష్మయ్య చెప్పినదాని ప్రకారం ముందు వెళ్లిన రెండు, మూడు బస్సులు రోడ్డుపై బైక్ పడి ఉండటాన్ని గమనించి తప్పించుకుని వెళ్లాయి. లక్ష్మయ్య లాగానే బ్రేకులు వేయలేక వెళ్లాయని అనుకున్నా.. కాస్త ముందుకెళ్లాక అయినా బస్సు ఆపి, రోడ్డుపై ఉన్న ఆ బైక్ ను, శివశంకర్ డెడ్ బాడీని పక్కకు జరిపి ఉంటే బహుశా ఇంత భారీ ప్రమాదం, భారీ ప్రాణనష్టం జరిగి ఉండేది కాదు.

పక్కనవాడు ఏమైపోతే మనకెందుకు? మనం సేఫ్ గా ఉన్నామా లేదా అన్న ఆలోచనా ధోరణి, తోటి వారికి సహాయం చేయాలన్న ఆలోచన లేకపోవడం 19 మంది ప్రాణాలను బలిగొందనడంలో సందేహం లేదు. డ్రైవర్ లక్ష్మయ్య కూడా సడెన్ బ్రేకులు వేయడం డేంజరని బైక్ పై నుంచి వెళ్లినా.. కొంతదూరానికి స్పీడ్ కంట్రోల్ చేసి బస్సును ఆపి ఉంటే.. బైక్ బస్సు కింద చిక్కుకుందన్న విషయం తెలిసేది. అంటే పేరుకు మనమంతా మనుషులమే అయినా.. మనలో మానవత్వం చచ్చిపోయింది.

రోడ్డుపై ప్రమాదం జరిగి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా వీడియోలు తీసుకుంటూ జనాలు చోద్యం చూస్తున్నారే తప్ప.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి కాపాడాలన్న ఆలోచన ఒక్కరికీ రాకపోవడం నిజంగా సిగ్గుచేటు. ప్రమాదానికి గురైన వారిని కాపాడితే పోలీసులు, కేసులు, ఐ విట్నెస్ అంటూ తిరగాల్సి ఉంటుందని ఇంకొందరు మాకెందుకు అనుకోవడం కూడా తప్పే. అదే ప్రమాదం మనకి జరిగితే.. కాపాడేందుకు ఒక్కరూ రాలేదని తిట్టుకుంటాం. మన ప్రాణం ఎంత ముఖ్యమో.. ఎదుటివారి ప్రాణం కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని మాత్రం ఒప్పుకోలేకపోతున్నాం.

కర్నూల్ బస్సు ప్రమాదం జరిగిన సమయంలో కూడా ఇదే జరిగింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఎవరికి వారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టే పనిలో ఉన్నారే తప్ప.. ఒక్కరు కూడా అంబులెన్స్ కు కాల్ చేయడం, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం కానీ చేయలేదన్న విషయం తేటతెల్లమైంది.

మనిషి ప్రాణానికి విలువ లేదా?

మన పెద్దల కాలంలో ఎవరికైనా ఆపద వస్తే.. ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. ఆ కాలంలో స్మార్ట్ ఫోన్లు లేవు. బ్రతకడానికి కావలసిన సంపాదన మాత్రమే ఉండేది. బంధాలకు, మనుషులకు విలువనిచ్చేవాళ్లు. వస్తువులను వాడుకుని మనుషులను ప్రేమించేవాళ్లు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మాయ, సోషల్ మీడియా మోజులో పడి.. ఎక్కడ ఏం జరిగినా వీడియోలు తీసి పోస్ట్ చేసి వైరల్ చేయాలనే ఆలోచిస్తున్నారే తప్ప.. మన వంతు సహాయం చేద్దామన్న ఆలోచన లేదు. మనిషి ప్రాణం కంటే వీడియోలను వైరల్ చేయడానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మానవత్వం, సహాయం గురించి ఎవరైనా మాట్లాడితే.. వాళ్లపై విమర్శలు చేసేవారే గాని.. ఎందుకు చెప్తున్నారని అసలే ఆలోచించడం లేదు. మనుషులను వాడుకుని, వస్తువులను ప్రేమించినంతకాలం మనలో మానవత్వం పాతాళంలో కూరుకుపోయే ఉంటుందన్నది నగ్నసత్యం.

Next Story