- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉరకలేసే యువతే తెలుగుదేశం ఆస్తి: చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం మహా పండుగ ‘మహానాడు’ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం మహా పండుగ ‘మహానాడు’ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలను ఉద్దేశించి ఈ రోజు ఉదయం ఎక్స్‌లో ఒక ట్వీట్‌చేశారు. ‘ఉత్తుంగ తరంగంలా ఎగసిపడే ఉత్సాహం తెలుగుదేశం కార్యకర్తల సొంతం. ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి. తరతరాల తెలుగు ఖ్యాతిని జగద్విదితం చేయడం తెలుగుదేశం పవిత్ర కర్తవ్యం. ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఆ దేశానికే తలమానికంగా మారాలనేది మన సంకల్పం. అందుకే మనం నిరంతరం శ్రమిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పరీక్షల్ని ఎదుర్కొన్న ప్రతిసారీ విజేతగానే నిలిచిందన్నారు. గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుపుకుంటున్న మహానాడును తొలిసారి కడపలో నిర్వహించతలపెట్టామని తెలిపారు. ‘మహానాడు సందర్భంగా ప్రజా సేవకు పునరంకితమవుతూ యువగళంకు ప్రాధాన్యతనివ్వాలని, అన్నదాతకు అండగా నిలవాలని, స్త్రీ శక్తికి పెద్దపీట వేయాలని, పేదల సేవలో నిరంతరం శ్రమించాలని, తెలుగు జాతి విశ్వఖ్యాతి లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యాచరణ ఉండాలని, కార్యకర్తే అధినేతగా మారాలనే నూతన మార్గదర్శకాలతో ఇనుమడించిన ఉత్సాహంతో మనం ముందుకు సాగాలి.. అదే నా ఆశ.. ఆకాంక్ష' అని ఆయన పేర్కొన్నారు.
'విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పది' అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. ‘కార్యకర్తలే పార్టీకి బలం, బలగం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలు నాకు నిత్య స్పూర్తి. ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్న పసుపు పండగ మహానాడుకు అందరికీ ఘన స్వాగతం పలుకుతున్నాను’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు.






