టీడీపీ సంచలన నిర్ణయం.. మళ్లీ ఐవీఆర్ఎస్ సర్వే

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-30 08:26:48  IST  )

రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది...

టీడీపీ  సంచలన నిర్ణయం.. మళ్లీ ఐవీఆర్ఎస్ సర్వే
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆయా పార్టీలు బలోపేతం దృష్టి సారించాయి. ఈ మేరకు కింద స్థాయి నుంచి పార్టీ పరిస్థితులపై పరిశీలన చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక అడుగు ముందుకేసి ఇప్పటికే నియోజకవర్గాలవారీగా పార్టీ పరిస్థితి, నాయకుల పనితీరుపై పరిశీలన చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

అదే బాటలో టీడీపీ

ఇటు తెలుగుదేశం పార్టీ కూడా అదే బాటలోకి దిగింది. గ్రామ, మండల, పట్టణాల్లో పార్టీ పరిస్థితిపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. నాయకుల పని తీరుపై పర్యవేక్షణ మొదలుపెట్టింది. ప్రజల్లోకి వెళ్లాలని లేని పక్షంలో కఠిన నిర్ణయం తప్పదని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మరోవైపు రాష్ట్ర, జిల్లా కమిటీలపైనా ఫోకస్ చేశారు. సామాజిక సమీకారణాల ఆధారంగా జాబితాను రెడీ చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో నాయకుల పని తీరుపై ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టారు.

కమిటీల ప్రకటనపై కసరత్తులు

ఈ మేరకు పదవులు ఇచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ ప్రక్రియను డిసెంబర్ 16 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర, జిల్లా కమిటీల జాబితాను ఈ నెల 17న మంత్రి నారా లోకేశ్ ప్రకటించనున్నారు. పోలవరం, శింగనమల, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లో రెండేసి మండలాల్లో పార్టీ కమిటీలపై అభ్యంతరాలు వచ్చినట్లు తేలింది. ఇక అత్యంతరాలున్న చోట్ల మరోసారి ఐవీఆర్ సర్వే చేపట్టాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. సోమవారం నుంచి పార్టీ నాయకులకు మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో శిక్షణా తరగతులు ప్రారంభించనున్నారు. సోమ, మంగళవారాల్లో 100 మండలాల అధ్యక్షులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు. పార్టీ బలోపేతంపై సీనియర్ నేతల అభిప్రాయాన్ని కూడా తీసుకుంటున్నారు. శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొననున్నారు.

Next Story