రెండోరోజూ అదే తంతు.. బాలకృష్ణ సైతం సస్పెండ్

by Disha Web Desk 23 |
రెండోరోజూ అదే తంతు.. బాలకృష్ణ సైతం సస్పెండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మూడోరోజు అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. శాసన సభా కార్యకలాపాలకు టీడీపీ సభ్యులు అడ్డుతగులుతున్నారని ఆరోపిస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడుతుండగా టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. అప్పుల బడ్జెట్, దివాళా బడ్జెట్ అంటూ నినాదాలు చేశారు. ఒకానొకదశలో స్పీకర్‌ పోడియంపై పేపర్లు విసిరే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌కు సీఎం వైఎస్ జగన్ సిఫార్సు చేశారు. దీంతో టీడీపీ సభ్యులపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం చర్యలకు ఉపక్రమించారు. టీడీపీ సభ్యులను ఒక్కరోజుపాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేలు నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌, ఆదిరెడ్డి భవాని, నిమ్మకాయల చినరాజప్ప, గద్దె రామ్మోహన్‌, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి, వెలగపూడి రామకృష్ణబాబులు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. ఇకపోతే ఈ బడ్జెట్ పూర్తయ్యే వరకు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే బడ్జెట్ సమావేశాలకు నిరసన ప్లకార్డులతో టీడీపీ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మర్చి జగన్ కల కల.. ప్రజలు గిల గిల అనే నినాదంతో నిరసన తెలిపారు.

నాడు అభివృద్ధిలో రికార్డు నేడు అప్పుల్లో రికార్డు అని టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. రోడ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ అప్పు రూ.6858 కోట్లు, పట్టణ మౌళిక అభివృద్ధి సంస్థ అప్పు రూ.7,277కోట్లు, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ అప్పు రూ.2000కోట్లు, రాష్ట్ర అభివృద్ధి సంస్థ అప్పు రూ.25,000కోట్లు అంటూ ప్లకార్డులతో నిరసన తెలుపుతూ టీడీపీ సభ్యులు సమావేశాలకు హాజరయ్యారు. అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం ఈ నిరసనలో పాల్గొన్నారు. రోడ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ అప్పు రూ.6858 కోట్లు అంటూ ప్లకార్డుల పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాలయ్య నినాదాలు చేశారు. అనంతతరం ర్యాలీగా సమావేశాలకు హాజరయ్యారు.ఈ నిరసనలో అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, ఆదిరెడ్డి భవాని, నందమూరి బాలకృష్ణ, పలువురు సభ్యులు, ఎమ్మెల్సీలు ఉన్నారు.


Next Story