జగన్ విశాఖ జపం.. పట్టించుకోని జనం !

by Dishanational2 |
జగన్ విశాఖ జపం.. పట్టించుకోని జనం !
X

నేను అమరావతిలో ఇల్లు కట్టుకొని కాపురముంటా.. అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా.. అంటూ 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్​ఎన్నో చెప్పారు. రాజధాని ప్రాంత ప్రజలు ఎంతో విశ్వసించారు. చివరకు అప్పటి సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్​ను కూడా మంగళగిరిలో ఆదరించలేదు. గంపగుత్తగా ఓట్లేశారు. తిరుగులేని ఆధిక్యతనిచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది మొదలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. కొన్నాళ్లు మూడు రాజధానులు అన్నారు. ఎన్నో పిల్లి మొగ్గలు వేశారు. ప్రజల్లో ఆశించిన స్పందన రాలేదు. ఇటీవల విశాఖ జపం మొదలెట్టారు. దీనికీ వాయిదాల పర్వం కొనసాగుతూ వచ్చింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సెప్టెంబరు నాటికి వైజాగ్​లో కాపురం పెడతానని సీఎం జగన్​ ప్రకటించారు. దీనిపై ఉత్తరాంధ్ర ప్రజలను కదిలిస్తే పెదవి విరుస్తున్నారు. ఇప్పటిదాకా చేయలేని అభివృద్ధి ఎన్నికల ఏడాదిలో ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

దిశ, ఏపీ బ్యూరో : జగనన్న మాట ఇస్తే మడమ తిప్పడని వైసీపీ శ్రేణులు అంటుంటాయి. ఈ పొగడ్త దివంగత నేత డాక్టర్​ వైఎస్​రాజశేఖర రెడ్డికి నప్పింది. అదే సీఎం జగన్ ​విషయంలో ఎన్నో యూటర్న్​లు ఉన్నాయి. ఎన్నికల ముందు ప్రజా సంకల్పయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన అనేక హామీలు ఇప్పటికీ నోచుకోలేదు. అందులో ప్రధానమైనవి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించడం. ఇవేవీ నెరవేర్చకుండా కేంద్ర సర్కారు నమ్మక ద్రోహానికి పాల్పడుతున్న సంగతి అందరికీ విదితమే. అదే కేంద్ర పెద్దలను భుజానికెత్తుకోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర తలసరి ఆదాయానికి ఆయువుపట్టుగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంటును కేంద్రం తెగనమ్ముతామన్నా నిలదీయ లేని దుస్థితిలోకి జారిపోయారు. రైల్వే జోన్​ఇవ్వకున్నా ప్రశ్నించలేని దయనీయ స్థితిలో పడిపోయారు. ఉత్తరాంధ్ర, సీమ వెనుకబడిన జిల్లాలకు బుందేల్​ఖండ్​ తరహా ప్యాకేజీ ఇవ్వాలని అడిగితే ఆపాటికే ఇస్తున్న అరకొర ప్యాకేజీని కూడా నిలిపేశారు. అయినా ఇదేంటని అడగలేని వైసీపీ నేతల నిస్సహాయతపై ప్రజల్లో ఆందోళన నెలకొంది.

పట్టభద్రుల తీర్పుతోనూ కలగని కనువిప్పు..

విభజన చట్టం ప్రకారం కేంద్రం ఓ మేజరు పోర్టును నిర్మించాలి. పర్యావరణ సమస్యల వల్ల దుగరాజపట్నం కాకుంటే మరొకటి అడగాలి. గత ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టు ప్రయోజనాల కోసం రామాయపట్నం పోర్టును ప్రతిపాదించలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక గంగవరం, కృష్ణపట్నం పోర్టులను అదానీ పరం చేశారు. తాబేదారుకు రామాయపట్నం మినీ పోర్టును అప్పగించారు. ఇప్పుడు నిర్మించబోయే పోర్టులను ఎవరికి ధారాదత్తం చేస్తారో తెలీదు. ఒక దశ వరకు ప్రభుత్వ రంగంలో ఆస్తుల సృష్టికి ప్రభుత్వాలు కృషి చేశాయి. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల ఆస్తులు, భూములను తెగనమ్మేందుకు సిద్దమవడాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. విశాఖ రాజధానిగా పరిపాలన ప్రారంభిస్తామని సీఎం ఎప్పుడో ప్రకటించారు. అయినా ఎలాంటి స్పందన లేదు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర యువత, పట్టభద్రులు, మేథావులు ప్రభుత్వానికి చెంపపెట్టుగా తీర్పునిచ్చారు. అయినా ప్రభుత్వ పెద్దలకు కనువిప్పు కలగలేదని విశ్లేషకులు అంటున్నారు.

వైసీపీ దందాలతో విశాఖ బిక్కుబిక్కు..

విశాఖ రిషికొండ తవ్వకాలపై అనేక వివాదాలు నడుస్తున్నాయి. విశాఖ పరిసరాల్లో ఎంతో విలువైన భూములు అధికార పార్టీ అండదండలతో ఆక్రమణలకు గురైనట్లు ప్రజలు కోడై కూస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ భూములు, భవనాలను తనఖా పెట్టి అప్పులు తేవడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించలేదు. ఇవేమీ చేయకపోగా విశాఖ బీచ్​లో డాక్టర్​ అబ్దుల్​ కలాం వ్యూ పాయింట్​పేరు మార్చడాన్ని ప్రజలు సహించలేకపోతున్నారు. ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన విశాఖ నగరంలో ఇప్పుడు భూకబ్జాదారుల దౌర్జన్యాలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పుడు సీఎం జగన్​అక్కడ కాపురం పెడతానంటే ఒరిగేదేంటని విపక్షాలు నిలదీస్తున్నాయి.

జీవీఎంసీ నిధులనూ దారి మళ్లించారు


మూడు రాజధానులు ప్రకటించినప్పుడే విశాఖను మీరు అభివృద్ధి చేసేదేంటని విశాఖ ప్రజలు పెదవి విరిచారు. నాలుగేళ్ల నుంచి స్టీల్​ ప్లాంటును తెగనమ్ముతామని కేంద్రం పదే పదే చెబుతుంటే సీఎం జగన్​ ఎందుకు నిలదీయలేకపోతున్నారు? విభజన హామీలను ఒక్కటీ అమలు చేయని కేంద్రాన్ని కౌగిలించుకుంటున్నారు. నాలుగేళ్లలో ఏ ఒక్క సమస్యనూ ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది. ఎన్నికల ఏడాదిలో ఇక్కడ కాపురం పెట్టి ఏం అభివృద్ధి చేస్తారో సీఎం జగన్​కే తెలియాలి. ఓ వైపు ఖాళీ ఖజానా. కొత్త అప్పులు పుట్టే స్థితి లేదు. చివరకు జీవీఎంసీ నిధులనూ దారి మళ్లిస్తున్నారు. భూకబ్జాల్లో తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు.

డాక్టర్​బీ గంగారాం, సీపీఎం కార్పొరేటర్, విశాఖ

ఇవి కూడా చదవండి : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మరో పథకం అమలు..



Next Story

Most Viewed