అభ్యర్థులను మార్చడం వైసీపీకి లాభమా? నష్టమా?

by Disha Web Desk 2 |
అభ్యర్థులను మార్చడం వైసీపీకి లాభమా? నష్టమా?
X

ఏది ఏమైనా సరే. దాదాపు యాభై నియోజకవర్గాల్లో మార్పులు అనివార్యమని వైసీపీ అధిష్టానం నిర్ణయించుకుంది. అందులో భాగంగా సీఎం జగన్​తో ఎమ్మెల్యేలు, ఎంపీల భేటీలు కొనసాగుతున్నాయి. తాడేపల్లిలో వైసీపీ పెద్దలు ప్రకాశం జిల్లా నేతలతో చర్చిస్తున్న సమయంలోనే గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కాడి దించేస్తున్నట్లు ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఆరోగ్యం సహకరించనందు వల్లేనని ఆయన చెబుతున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నట్లు కూడా చెప్పారు. నియోజకవర్గాల మార్పు వల్ల నష్టమెంత? లాభమెంత అని ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ప్రజాభీష్టం మేరకే మార్పులు చేస్తున్నట్లు పార్టీ అధిష్టానం స్పష్టం చేస్తోంది.

దిశ, ఏపీ బ్యూరో: నియోజకవర్గ ఇన్‌చార్జుల మార్పు గురించి వైసీపీ రెండో జాబితా విడుదలకు కసరత్తు పూర్తి చేసింది. నేడో రేపో వెల్లడించే అవకాశముంది. బుధవారం ప్రకాశం జిల్లా నుంచి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్​, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్​ జంకె వెంకటరెడ్డి, కొండపి మాజీ ఇన్​చార్జి మాదాసు వెంకయ్య తాడేపల్లి చేరుకున్నారు. తొలుత విజయసాయిరెడ్డితో భేటీ అయ్యారు. మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి మిగతా జిల్లాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో చర్చించారు.

స్థానభ్రంశం లాభమేనా..

ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో జరుగుతున్న చర్చ ఒక్కటే. నేతల స్థాన భ్రంశం వల్ల లాభమా.. నష్టమా అనే దానిపై పార్టీ శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతలో ఎమ్మెల్యేలు లేదా ఇన్​చార్జుల భాగమెంత ? నేతలను మార్చినంత మాత్రాన ప్రయోజనముంటుందా ? సీట్లు దక్కని వాళ్లంతా పార్టీ విజయం కోసం కలిసి పనిచేస్తారా ? అనే ప్రశ్నలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సీటు లేదని భావిస్తున్న నాయకులు ముందుగానే కాడి కిందపడేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈదఫా ఆయనకు టిక్కెట్​ లేదని అధిష్టానం చెప్పి ఉండొచ్చని తెలుస్తోంది.

వలంటీర్ల సమ్మె బాట.. వైసీపీకి షాక్..

నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వర్గాలున్నాయి. వీళ్లను ఎలా దగ్గర చేసుకోవాలనేది ఆలోచించకుండా ఆ నెపాన్ని ఎమ్మెల్యేలు, ఇన్​చార్జులపై నెట్టి కొత్త ముఖాలను బరిలోకి దింపినంత మాత్రాన సానుకూల ఫలితాలు రావని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్లూ సీఎం జగన్​ తమ సైన్యంలా భావించే వలంటీర్లు సైతం సమ్మెకు సిద్దం కావడాన్ని వైసీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. మానవ వనరులతో ఓ వ్యవస్థను ఏర్పాటు చేసేటప్పుడు దీర్ఘ కాలికంగా ఎదురయ్యే సమస్యల గురించి పట్టించుకోకపోవడమే నేడు వలంటీర్ల అసంతృప్తికి దారితీసింది. అంగన్​వాడీ, పారిశుధ్య కార్మికులు, ఆశాలతో సహా చాలీ చాలని వేతనాలతో బతుకులు నెట్టుకొస్తున్న చిరుద్యోగులు, కార్మికుల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా వ్యవహరించాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి.

ప్రకాశం జిల్లా బరిలో ఉండేది వీళ్లేనా?

ఒంగోలు లోక్ సభ: మాగుంట శ్రీనివాసుల రెడ్డి

ఒంగోలు: బాలినేని శ్రీనివాసరెడ్డి

సంతనూతలపాడు: మేరుగ నాగార్జున

కొండపి: ఆదిమూలపు సురేష్​

కనిగిరి: బుర్రా మధుసూదన్​ యాదవ్​

దర్శి: బూచేపల్లి శివప్రసాద రెడ్డి

మార్కాపురం: కేపీ నాగార్జునరెడ్డి

యర్రగొండపాలెం: తాడిపర్తి చంద్రశేఖర్​

గిద్దలూరు: శిద్దా రాఘవరావు లేదా అన్నా రాంబాబు


Next Story

Most Viewed