కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ సక్సెస్.. DCM పవన్ కల్యాణ్ హర్షం

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-04 17:12:45  IST  )

రాష్ట్రంలో కుంకీ ఏనుగుల(Kunki Elephants) ఆపరేషన్ మొదలయ్యింది. కుంకీ ఏనుగులు ద్వారా చేపట్టిన తొలి ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేశాయి.

కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ సక్సెస్.. DCM పవన్ కల్యాణ్ హర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కుంకీ ఏనుగుల(Kunki Elephants) ఆపరేషన్ మొదలయ్యింది. కుంకీ ఏనుగులు ద్వారా చేపట్టిన తొలి ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేశాయి. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలి వద్ద మామిడి తోటలను ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపుని కుంకీలు విజయవంతంగా దారి మళ్లించి అడవిలోకి తరిమికొట్టినట్టు అటవీశాఖ అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా తెలియవచ్చింది. కృష్ణ, జయంత్, వినాయక అనే కుంకీలు ఆ ఆపరేషన్‌లో పాల్గొని అడవి ఏనుగులను పంటల వైపు రాకుండా అడ్డుకుని తిరిగి అడవిలోకి మళ్లించాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కృష్ణ అనే కుంకీ ఏనుగు చాలా చురుకుగా పాల్గొన్నట్టు అటవీ అధికారులు తెలియజేశారు.

మొగిలి ప్రాంతంలో 15 రోజులుగా ఏనుగుల సంచారం ఉన్న సమాచారంతో అధికారులు ఈ ఆపరేషన్ చేపట్టారు. కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తీసుకువచ్చిన అనంతరం రెండు నెలల శిక్షణ తర్వాత మొదటి ఆపరేషన్ విజయవంతంగా చేపట్టడం ఆనందాన్నిచ్చింది. ఏనుగుల సంచారంతో ఇబ్బందులు పడుతున్న సరిహద్దు ప్రాంతాల రైతులు, ప్రజలకు ఈ ఆపరేషన్ భరోసా ఇస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏనుగుల గుంపు నుంచి పంటలను, ప్రజల ప్రాణాలు కాపాడే దిశగా ప్రణాళికాబద్ధంగా పని చేస్తుంది అనడానికి కుంకీలతో చేపట్టిన ఆపరేషన్ తొలి అడుగు.

ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న అటవీ అధికారులకు, మావటిలు, కావడిలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభినందనలు తెలియజేశారు. అలాగే అడిగిన వెంటనే కుంకీ ఏనుగులు రాష్ట్రానికి ఇచ్చి సహకరించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి, ఆ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేకి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తదుపరి ఆపరేషన్ పుంగనూరు అటవీ ప్రాంతంలో చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Next Story