పేదలకు గుడ్ న్యూస్.. 2.50 లక్షల ఇళ్ల నిర్మాణాలపై సీఎం కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం రెండో రోజు సైతం కొనసాగింది. అయితే శుక్రవారం సమ్మర్ యాక్షన్ ప్లాన్, గృహ నిర్మాణ శాఖపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు..

పేదలకు గుడ్ న్యూస్.. 2.50 లక్షల ఇళ్ల నిర్మాణాలపై సీఎం కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(Ap Cm Chandrababu) అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం రెండో రోజు సైతం కొనసాగింది. అయితే శుక్రవారం సమ్మర్ యాక్షన్ ప్లాన్, గృహ నిర్మాణ శాఖ(Summer Action Plan, Housing Department)పై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. గృహ నిర్మాణానికి సంబంధించి సీఎం స్పష్టమైన డెడ్ లైన్లను ప్రకటించారు. వచ్చే ఆగస్టు 15 నాటికి 2.50 లక్షల ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే డిసెంబర్ నాటికి మరో 2.38 లక్షల ఇళ్లను పూర్తి చేసి, 2027 డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలనే భారీ లక్ష్యాన్ని అధికారులకు సీఎం చంద్రబాబు నిర్దేశించారు.

కఠిన ఆదేశాలు జారీ

ఇక భూ సమస్యల పరిష్కారంపై చంద్రబాబు అత్యంత కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు జిల్లాలో ఉన్న 22A భూముల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి 22Aకి సంబంధించిన ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలకు పైగా భూవివాదాల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వేగంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు త్వరలోనే డీఆర్వో (DRO), ఆర్డీవో (RDO)లకు పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

సామాజిక న్యాయం, పరిపాలన పరమైన అంశాలపైనా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీలకు అందుతున్న లబ్ధిని బుడగజంగాలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలని, క్షేత్రస్థాయిలో కలెక్టర్లు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను పటిష్టంగా అమలు చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

Next Story