కూటమి ప్రభుత్వం స్మార్ట్ టెక్నాలజీ ప్రవేశపెట్టింది : ఎమ్మెల్యే

by Thanuru Gopichand |

అంగన్ వాడీ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం స్మార్ట్ టెక్నాలజీని ప్రవేశపెట్టిందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ (MLA Vasantha Venkata Krishna Prasad) తెలిపారు.

కూటమి ప్రభుత్వం స్మార్ట్ టెక్నాలజీ ప్రవేశపెట్టింది : ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్: అంగన్ వాడీ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం స్మార్ట్ టెక్నాలజీని ప్రవేశపెట్టిందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ (MLA Vasantha Venkata Krishna Prasad) తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 292 మంది ఐసీడీఎస్ సిబ్బందికి స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ సుమారు 292 మంది ఐసీడీఎస్ సిబ్బందికి 5జీ స్మార్ట్ ఫోన్లను (5G Smart Phones) పంపిణీ చేశారు. వీటి విలువ రూ.36.50 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సేవల్లో వేగం, పారదర్శకతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అందులో భాగంగా అంగన్ వాడీలను కూడా సాంకేతిక సహకారంతో బలోపేతం చేస్తోందన్నారు. అంగన్ వాడీ సిబ్బందకి స్మార్ట్ టెక్నాలజీని అందిస్తోందని వివరించారు.

స్మార్ట్ ఫోన్ల సహకారంతో మరింత వేగంగా అంగన్ వాడీ సేవలను అందించడానికి వీలు పడుతుందన్నారు. పిల్లల పోషణ, తల్లుల ఆరోగ్య పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు డిజిటల్ వ్యవస్థ దోహదపడుతుందన్నారు. తద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ ప్రజలందరికీ తెలుస్తుందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్ వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం ఇచ్చిన 4జీ స్మార్ట్ ఫోన్లు సరిగ్గా పని చేయలేదన్నారు. అందుకే 5జీ నెట్వర్కుతో ఉన్న స్మార్ట్ ఫోన్లను అందజేస్తున్నామని తెలియజేశారు.

అంగన్ వాడీ కార్యకర్తలకు జీతాన్ని రూ.11,500లకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మినీ అంగన్ వాడీలను అంగన్ వాడీ కేంద్రాలుగా మార్చిన ఘతన కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. అంగన్ వాడీ టీచర్లు, ఆశావర్కర్లకు కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనం లభించేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరామన్నారు. దానిపై త్వరలోనే సానుకూల వార్త వినిపిస్తుందన్నారు. అంగన్ వాడీలు కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని చూరగొంటుడడం హర్షణీయమన్నారు. వారి పట్ల నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్ వాడీ కేంద్రాలకు పంపిస్తున్నారని తెలిపారు. ఐసీడీఎస్ సిబ్బంది అంకితభావంతో పని చేసి ప్రభుత్వ లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

Next Story