పోలీసులకు అందుకే సమాచారమివ్వలేదు.. తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఆలయ నిర్వాహకుడు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-01 09:54:01  IST  )

కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాట (Kasibugga Stempede) ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా స్పందించారు.

పోలీసులకు అందుకే సమాచారమివ్వలేదు.. తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఆలయ నిర్వాహకుడు
X

దిశ, వెబ్‌డెస్క్: కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాట (Kasibugga Stempede) ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా స్పందించారు. తొక్కిసలాటలో భక్తులు మరణించడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. సాధారణంగా ప్రతి శనివారం ఆలయానికి 1500 నుంచి 2 వేల మంది వరకూ భక్తులు వస్తుంటారని, ఈరోజు కూడా అదేస్థాయిలో భక్తులు వస్తారని అనుకున్నామని చెప్పారు. కానీ.. ఇంత పెద్దసంఖ్యలో భక్తులు వస్తారని ఊహించలేదని, అందుకే పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఆలయానికి రెండు, మూడువేల మంది భక్తులు వరకూ వస్తారని అంచనా ఉందని, అంచనాకు మించి వేలసంఖ్యలో భక్తులు రావడంతో పరిస్థితి చేయిదాటిపోయిందన్నారు. ప్రస్తుతం ఆలయ పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోగా.. అక్కడే హరిముకుంద్ పండా కూడా ఉన్నారు.

కాగా..12 ఎకరాల్లో నాలుగేళ్ల క్రితం హరిముకుంద్ పండా ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. సుమారు రూ.12 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించగా.. ఈ ఏడాది మే నెల నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. నేడు శనివారంతో పాటు.. కార్తీక ఏకాదశి కూడా కలిసి రావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో.. రద్దీ ఎక్కువై రెయిలింగ్ ఊడిపడి తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. పూర్తి విచారణ చేశాక వివరాలు వెల్లడించనున్నారు.

Next Story