ప్రభుత్వంపై పోరుకు నిరుద్యోగ యువత సిద్ధం.. టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు

by Dishafeatures2 |
ప్రభుత్వంపై పోరుకు నిరుద్యోగ యువత సిద్ధం.. టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘బడుగు బలహీనవర్గాల యువతకు ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక ఆశయం. ఆ ఆశయసాధనకు రాత్రింబవళ్ళు పుస్తకాలతో కుస్తీపట్టి విజయం సాధించేందుకు అలుపెరగని పోరాటం చేస్తారు. కానీ ప్రభుత్వం నుంచి గత నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్లు అనుకున్నంత స్థాయిలో రావడం లేదు’ అని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు అన్నారు. ‘ఇచ్చిన ఎస్.ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు భౌతిక పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో అతీగతీలేదు. ఈ ప్రభుత్వ ఏలుబడిలో ఏటా జనవరి ఒకటో తారీఖునాడు జాబ్ క్యాలెండర్ అని అట్టహాసంగా ప్రకటించినప్పటికీ ఆచరణలో సంపూర్ణంగా విఫలమైంది అని ఎమ్మెల్సీ చిరంజీవి రావు విమర్శించారు. విజ్ఞాన ఆలయాలుగా భాసిల్లే యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు భర్తీకాక విద్యావిహీనతతో కూనరిల్లుతున్నాయి అని చెప్పుకొచ్చారు. దీనివల్ల జాతీయ స్థాయిలో రాష్ట్ర యూనివర్సిటీల ర్యాంకులన్నీ దిగజారిపోయినవి. యూనివర్సిటీలు ఆచార్యులు లేకపోవడంతో నిరుద్యోగులను తయారీ చేసే కర్మాగారాలుగా మారినవి. లక్షలాది టీచర్ పోస్టుల భర్తీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే చెల్లింది’ అని అన్నారు. లక్షలాది ఖాళీలను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. ఉద్యోగ విరమణ వయస్సును ఎవరూ కోరకుండానే ఆకస్మాత్తుగా 60 నుంచి 62కు పెంచడం నిరుద్యోగుల పాలిట శరాఘాతమేనని ఎమ్మెల్సీ చిరంజీవి రావు చెప్పుకొచ్చారు.

ఎన్నికల సంవత్సరమైనా నోటిఫికేషన్స్ ఇబ్బడి ముబ్బడిగా వస్తాయని నిరుద్యోగలోకం గంపెడాశతో ఎదురుచూస్తుంది. లక్షలాది విద్యార్థులు కోచింగ్ కోసం పట్టణాల్లో రూమ్స్ తీసుకుని సంవత్సరాల తరబడి అక్షర తపస్సు చేస్తున్నారు. ప్రభుత్వ కొలువు సాధించాలనే తమ చిరకాల వాంఛను నెరవేర్చుకునే అవకాశం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం ఉచిత పథకాలకు, అనర్హులకు లెక్కకు మించి విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తుంది. అందువల్ల ఉద్యోగుల పదవీ విరమణ వయసును మళ్ళీ పెంచే యోచనలో ఉన్నట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇదే నిజమైతే నిరుద్యోగ వర్గం ఉవ్వెత్తున లేచి ఉప్పెనలా ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతుంది. “మేధావుల సేవలను ఏ సమాజమైతే ఉపయోగించుకోలేదో ఆ సమాజం అధఃపాతాళానికి చేరుతుంది”. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి జూనియర్, డిగ్రీ లెక్చరర్లు, ఏఈ పోస్టులు, గ్రూప్-2 ఉద్యోగాలు, మెగా డియస్సీకి సంబంధించిన నోటిఫికేషన్స్ జారీ చేసి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగుపూలు పూయించాలి. లేనియెడల ప్రభుత్వం పై పోరుకు నిరుద్యోగ యువత సిద్ధంగా ఉన్నది. తక్షణమే ఈ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని టీడీపీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వేపాడ చిరంజీవిరావు డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed