తణుకులో భారీ గోల్డ్ స్కామ్: రూ. 25 కోట్లతో కిలాడీ జంట జంప్!

by Naga Rani Yarlagadda |

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో భారీ గోల్డ్ బిస్కట్ కుంభకోణం వెలుగుచూసింది.

తణుకులో భారీ గోల్డ్ స్కామ్: రూ. 25 కోట్లతో కిలాడీ జంట జంప్!
X

దిశ ప్రతినిధి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో భారీ గోల్డ్ బిస్కట్ కుంభకోణం వెలుగుచూసింది. తక్కువ ధరకే బంగారం ఇస్తామని, లక్షకు రూ. 30 వేల వడ్డీ ఇస్తామంటూ నమ్మబలికిన ఒక కిలాడీ జంట సుమారు రూ. 25 కోట్ల మేర అమాయకులను ముంచేసింది. బాధితుల్లో ఎక్కువ మంది టీచర్లు, మహిళలు, చివరకు బంగారు దుకాణ యజమానులు కూడా ఉండటం గమనార్హం.

నమ్మించి.. నట్టేట ముంచి..

తణుకు పట్టణానికి చెందిన స్నేహలత, దుర్గాప్రసాద్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరు తొలుత బ్యూటీషియన్లు, టీచర్లు మరియు మహిళలను సంప్రదించి, మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే అంటే గ్రాము బంగారం రూ. 12 వేలకే ఇస్తామని ఎర వేశారు. మొదట్లో కొందరికి ఆశ చూపినట్లుగానే వడ్డీలు, బంగారం ఇచ్చి నమ్మకం కలిగించారు. అది నిజమేనని నమ్మి బాధితులు తమ స్నేహితులు, బంధువుల వద్ద నుంచి అప్పులు తెచ్చి మరీ వీరికి కట్టబెట్టారు. మొత్తం 25 మందికి పైగా బాధితుల వద్ద నుంచి రూ. 25 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది.

మీడియా ముందుకు బాధితులు..

ఈమేరకు శనివారం తణుకులోని అంబేడ్కర్‌ భవనంలో దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ల రాజు ఆధ్వర్యంలో బాధితులు మీడియా ముందుకు వచ్చారు. రూ. లక్షకు రూ. 30 వేలు వడ్డీ, తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పి మొదట చిన్న మొత్తాలు ఇచ్చి నమ్మకం కలిగించినట్లు బాధితులు తెలిపారు. నగదు, బంగారం, నగలు పెద్ద మొత్తంలో తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు 25 మందికి పైగా బాధితులు ఉన్నారని, సుమారు రూ. 25 కోట్ల మేర మోసం జరిగిందని సమావేశంలో వెల్లడించారు. తన వద్ద నుంచి రూ. 25 లక్షల నగదు, 30 కాసుల బంగారం తీసుకున్నారని బాధితురాలు ఉష రమ్య ఆరోపించారు. తన ద్వారా కుటుంబ సభ్యులు, పరిచయస్తుల వద్ద నుంచి మరో రూ.40 లక్షలు, 60 కాసుల బంగారం కూడా మోసపోయినట్లు తెలిపారు. తన వద్ద నుంచి 36 కాసుల బంగారం, రూ.44 లక్షల నగదు తీసుకున్నారని మరో బాధితురాలు శైలజ తెలిపారు. నగదు బదిలీ వివరాలు, వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని బాధితులు వెల్లడించారు. ఫిబ్రవరిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన సొమ్ములు తిరిగి ఇవ్వాలని అడిగితే తిరిగి తమపైనే ఆరోపణలు చేస్తున్నారని అంతేకాకుండా ఫొటోలు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో అల్లరి చేస్తామంటూ తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటికే స్నేహలతపై మూడు కేసులు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తణుకు పట్టణ ఇన్‌ఛార్జి సీఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

Next Story