అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా.. ఇద్దరు కార్మికులకు గాయాలు

by Thanuru Gopichand |

అధికారుల నిర్లక్ష్యమో.. కార్మికుల గ్రహచారమో విద్యుత్ ఘాతానికి గురయ్యారు.

అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా.. ఇద్దరు కార్మికులకు గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్ : విధి నిర్వహణలో ఉండగా ఇద్దరు విద్యుత్ కార్మికులు కరెంట్ షాక్ కు (Electric Shock) గురయ్యారు. అకస్మాత్తుగా విద్యుత్ లైన్ లో కరెంట్ సరఫరా కావడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కాకినాడ జిల్లాలోని జగ్గంపేట మండల (Jaggampeta) పరిధిలో ఉన్న గొల్లలకుంట గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గొల్లకుంట గ్రామంలోని రామచంద్రపురం కాలనీలో కొత్త విద్యుత్ లైన్ తీగల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఇద్దరు విద్యుత్ కార్మికులు (Electricity Workers) చేస్తున్నారు. స్తంభంపైకి ఎక్కి వారు పని చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ పరిణామంలో కరెంట్ షాక్ తగిలి వారిద్దరూ స్పృహను కోల్పోయారు. ఒకరు విద్యుత్ స్తంభంపైనే వేలాడగా మరొకరు పై నుంచి కింద పడ్డారు. ఈ షాకింగ్ ఘటనలో కార్మికులు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికప్పుడే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెనుప్రమాదం తప్పినట్లైంది.

విద్యుత్ శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు అధికారులను కోరుతున్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి.. తగిన పరికరాలను వారికి అందించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Next Story