పలమనేరులో విద్యార్థుల ఎగ్జామ్ ప్యాడ్ వివాదం.. పరీక్షకు అనుమతించని అధికారులు

by Disha Web Desk 3 |
పలమనేరులో విద్యార్థుల ఎగ్జామ్ ప్యాడ్ వివాదం.. పరీక్షకు అనుమతించని అధికారులు
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన విషయం అందరికి సుపరిచితమే. ఈ నేపథ్యంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎన్నికల కోడ్ నిబంధనలను అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ఎన్నికల సంఘం నిబంధనలను తుంగలో తొక్కుతుందని అటు మీడియా, ఇటు విపక్షాలు కోడై కూస్తున్నాయి.

అయినా వైసీపీ మాత్రం ఆ వార్తలను పట్టించుకోవడం లేదు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే చేసిన పని కారణంగా పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులను అధికారులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. ఇప్పటికే వైసీపీ స్వార్ధానికి పదహారు మంది వాలంటీర్లు సస్పెండ్ అయ్యారు. కాగా తాజాగా విద్యార్థుల జీవితాలతో కూడా వైసీపీ ఆటలాడుతోందని అటు విపక్షాలు ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

దీనితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన చిత్తూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా లోని పలమనేరులో విద్యార్థుల ఎగ్జామ్ ప్యాడ్ పై ఎమ్మెల్యే ఎన్ వెంకట గౌడ్ ఫోటో ఉండడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఆర్డీఓ పేర్కొంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఎగ్జామ్ ప్యాడ్ పై ఎమ్మెల్యే ఫోటో ఎందుకు ఉందొ వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే ఎన్ వెంకట గౌడ్ కు ఆర్డీఓ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఇక రాజకీయ నాయకుల ఫొటోలతో ఉన్న ఎగ్జామ్ ప్యాడ్లను ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించవద్దని విద్యాశాఖ అధికారులను ఆర్డీఓ ఆదేశించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఫోటో ఉన్న ప్యాడ్లను కొంతమంది విద్యార్థుల నుండి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ విద్యార్థులను పరీక్షకు అనుమతించారు. అయితే మొదట విద్యార్థులను పరీక్షకు అనుమతించకపోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.

ఇక ఈ ఘటనపై స్పందించిన ఆర్డీఓ మోనోజ్ మాట్లాడుతూ.. ఎగ్జామ్ ప్యాడ్ పై ఎమ్మెల్యే ఫోటో ఉండడం ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించినట్లే అని పేర్కొన్నారు. ఇప్పటికే దీనిపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఇక ఈ వివాదానికి కారణమైన వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా విచారణలో ఎమ్మెల్యే ప్రమేయం ఉందని తేలితే ఎమ్మెల్యే ఎన్నికల ఖర్చు కొందనే దీన్ని లెక్కిస్తామని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed