- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒంగోలు ఐఐఐటీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన
కనిగిరికి క్యాంపస్ ను తరలించొద్దని గత కొద్ది రోజులుగా నిరసనలు.

దిశ, వెబ్ డెస్క్ : ఒంగోలు ఐఐఐటీ (IIIT) క్యాంపస్‌ను కనిగిరికి(Kanigiri) తరలించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై విద్యార్థులు (Students) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా తరగతులను బహిష్కరించి, శాంతియుత మార్గంలో విద్యార్థులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. శనివారం నాటికి తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. ఆదివారం కూడా క్యాంపస్ వెలుపల బైఠాయించిన విద్యార్థులు "కనిగిరి వద్దు - ఒంగోలే ముద్దు" అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఒంగోలులో ఇప్పటికే 50 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, నూజివీడు వంటి ప్రతిష్టాత్మక క్యాంపస్ కంటే ఇది 10 ఎకరాలు అదనమని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
అన్ని వసతులు ఉన్న నగర ప్రాంతాన్ని వదిలి, మారుమూల ప్రాంతానికి తరలించడం వల్ల తమ విద్యాభ్యాసం, భవిష్యత్తు అవకాశాలు దెబ్బతింటాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత భవనం లేక ఇప్పటికే అద్దె ప్రాంగణాల్లో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. ఇప్పుడు ఏకంగా నగరాన్నే మార్చడం సరికాదని వారు వాదిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని కనిగిరికి ఒంగోలు ఐఐఐటీ తరలింపు ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతున్నారు. ఒంగోలులోనే శాశ్వత భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు తల్లిదండ్రులు, స్థానిక ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ప్రభుత్వం స్పందించే వరకు ఈ పోరాటం ఆపే ప్రసక్తి లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.






