నగరి ‘కొండచుట్టు మండపం’ కూల్చివేతను ఆపండి : మాజీ మంత్రి రోజా

by Thanuru Gopichand |

చారిత్రక 'కొండచుట్టు మండపం' ఉనికిని కాపాడాలని కోరుతూ మాజీ మంత్రి ఆర్.కె. రోజా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్‌ ను కోరారు.

నగరి ‘కొండచుట్టు మండపం’ కూల్చివేతను ఆపండి : మాజీ మంత్రి రోజా
X

దిశ, నగరి: చిత్తూరు జిల్లా నగరి పట్టణంలోని చారిత్రక 'కొండచుట్టు మండపం' ఉనికిని కాపాడాలని కోరుతూ మాజీ మంత్రి ఆర్.కె. రోజా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్‌ ను కోరారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఎన్ హెచ్ఏఐ అధికారులను కలిశారు. ఎన్ హెచ్-716 రహదారి విస్తరణలో భాగంగా ఈ ప్రాచీన కట్టడాన్ని తొలగించాలనే ప్రతిపాదనపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

600 ఏళ్ల చరిత్రను కాపాడుకోవాలి

సుమారు 600 ఏళ్ల క్రితం సాల్వ రాజ్య కాలంలో నిర్మించబడిన ఈ మండపానికి అపారమైన చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఉందని రోజా పేర్కొన్నారు. కార్వేటినగరం సంస్థానాధీశులు, నగరి పాలెగార్ల కాలం నుంచి ఈ మండపం భక్తుల ఆరాధ్య దైవంగా ఉందని, పాలెగార్ చెంగమ నాయుడు హయాంలో ఇక్కడి గణపతి పూజల కోసం ప్రత్యేక భూములు కూడా కేటాయించబడ్డాయని ఆమె గుర్తు చేశారు. నేటికీ లక్షలాది మంది భక్తులు ఇక్కడ వార్షిక ఉత్సవాలను నిర్వహిస్తున్నారని వివరించారు.

హైకోర్టు స్టేను గౌరవించండి

రహదారి విస్తరణలో భాగంగా ఈ కట్టడాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ స్థానిక భక్తులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా... న్యాయస్థానం ఈ నెల 20న స్టే మంజూరు చేసిందని రోజా గుర్తు చేశారు. న్యాయస్థాన ఉత్తర్వులను గౌరవిస్తూ కూల్చివేత పనులను తక్షణమే నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు.

హైవే డిజైన్‌లో మార్పులు చేయాలి

"ప్రజా ప్రయోజనాలు, భక్తుల మనోభావాలు మరియు పురావస్తు విలువలను దృష్టిలో ఉంచుకుని ఈ వారసత్వ సంపదకు ఎటువంటి నష్టం కలగకుండా హైవే డిజైన్‌లో సాంకేతిక మార్పులు చేయాలి" అని ఆమె ఎన్ హెచ్ఏఐ అధికారులను కోరారు. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు, చారిత్రక ఆధారాలను లేఖకు జతచేశారు. స్థానిక ప్రజల పక్షాన నిలబడి, ఈ చారిత్రక కట్టడం కనుమరుగు కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆమె స్పష్టం చేశారు.

Next Story