ఆత్మ మాట్లాడిందట..చనిపోయిన వ్యక్తితో స్టేట్‌మెంట్!

by velandi.Saikiran |   (  Updated:2026-04-20 21:45:53  IST  )

లంచాలకు మరిగిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది అసలైన బాధితులకు అన్యాయం చేస్తున్నారు.

ఆత్మ మాట్లాడిందట..చనిపోయిన వ్యక్తితో స్టేట్‌మెంట్!
X

ఆత్మ మాట్లాడిందట..!

చనిపోయిన వ్యక్తితో స్టేట్‌మెంట్ రికార్డు

– విచారణకు రానని చెప్పినట్టు నమోదు

– కర్నూలు జిల్లా ఓర్వకల్లు రెవెన్యూ సిబ్బంది నిర్వాకం

– 1.4 సెంట్ల భూమిని ఇతరులకు ఆన్‌లైన్‌ చేసిన వైనం

– ఖంగుతిన్న స్థల యజమాని కుటుంబ సభ్యులు

– జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం

దిశ, ఏపీ బ్యూరో : ఓర్వకల్లు మండలంలో ఆత్మలు మాట్లాడుతున్నాయట. అదికూడా అందరితో కాదు.. ఒక రెవెన్యూ వాళ్లతో మాత్రమేనట. వింతగా, విచిత్రంగా అనిపించినా, అదేంటో తెలియాలంటే కర్నూలు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఓర్వకల్లు తహసీల్దార్‌ కార్యాలయం వరకు వెళ్లాల్సిందే.

విషయమేమిటంటే..

లంచాలకు మరిగిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది అసలైన బాధితులకు అన్యాయం చేస్తున్నారు. ఓర్వకల్లు మండలంలో జరిగిన ఓ ఘటనను ఇందుకు నిదర్శనం. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన వడ్డే మద్దయ్యకు సర్వే నెంబర్‌ 444లో రెండు ఎకరాల పొలం ఉంది. ఇది పూర్తిగా పట్టా భూమి. 1995లో మేకల వెంకటేశ్వర్లు నుంచి వీ.జీ. మద్దయ్య కొనుగోలు చేశాడు. ఆ తర్వాత మద్దయ్య పేరుపై ఆన్‌లైన్‌లో కూడా నమోదయింది. అయితే, అదే గ్రామానికి చెందిన అనకాల పుల్లయ్య అనే వ్యక్తితో తహసీల్దార్‌ రూ.లక్షల్లో డీల్‌ కుదుర్చుకున్నాడు. మద్దయ్య పేరు మీద ఆన్‌లైన్‌లో ఉన్న రెండు ఎకరాల్లో 64 సెంట్లు, ఇది సర్వే నెంబర్‌లో మిగులు భూమిగా ఉన్న 30 సెంట్లకు మరో10 సెంట్లు కలిపి ఎకరా నాలుగు సెంట్ల భూమిని ఎలాంటి పత్రాలు లేని అనకల పుల్లయ్య పేరుమీద ఆన్‌లైన్‌ చేశారు. విషయం తెలుసుకున్న మద్దయ్య కుమారుడు మల్లికార్జున తహసీల్దారును నిలదీశాడు. తమ భూమిని వేరొకరి పేరుపై ఎలా బదలాయింస్తారని ప్రశ్నించాడు. మల్లికార్జున మీసేవ నిర్వాహకుడు కూడా కావడంతో మ్యుటేషన్లపై కాస్త అవగాహన ఉంది. దీంతో ఎప్పటికప్పుడు ఎక్కడికి అక్కడ రెవెన్యూ సిబ్బంది చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ వచ్చాడు. దీంతో దిక్కుతోచని రెవెన్యూ సిబ్బంది మల్లికార్జున నోరెత్తితే తమ ఉద్యోగాలకు గండం వస్తుందని తెలుసుకొని పోలీసుల ద్వారా అణచివేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.

చనిపోయిన మద్దయ్య మాట్లాడినట్లు..

అనకల పుల్లయ్య అనే వ్యక్తి సర్వే నెంబర్‌ 444లో ఉన్న రెండు ఎకరాల భూమిని అసలు ఆ భూమికి సంబంధం లేని మేకల సుబ్బమ్మ అనే మహిళ ద్వారా కొనుగోలు చేసినట్లుగా 2024లో అక్రమంగా డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఆన్‌లైన్‌ నమోదు కోసం తహసీల్దారు వద్దకు వెళ్లాడు. అది తప్పుడు రిజిస్ట్రేషన్‌ అని తెలుసుకున్న తహసీల్దారు ఆన్‌లైన్‌లో నమోదుకు ససేమిరా అనడంతో, ఆనకల పుల్లయ్య మరో కొత్త నాటకానికి తెరలేపాడు. ఈసారి సర్వే నంబరు 444లో తన పేరు మీద ఉన్న 1.30 ఎకరాల భూమిని ఆన్‌లైన్‌ చేయమని తహసీల్దార్‌కు మరోసారి దరఖాస్తు చేశాడు. రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి.. డబ్బు ఆశ చూపి మద్దయ్యకు చెందిన భూమిని అక్రమంగా దక్కించుకునేందుకు ప్రణాళిక రూపొందించాడు. అయితే మద్దయ్య చనిపోయాడు అన్న విషయం తెలియని తహసీల్దార్‌ ఆయనతో మాట్లాడకుండానే మాట్లాడినట్టుగా స్టేట్మెంట్‌ 04–01–2025న నమోదు చేశాడు. అది కూడా ఆయన విచారణకు రానని చెప్పినట్టుగా స్టేట్మెంట్‌ రికార్డు చేశాడు. ఆ తర్వాత 2025 జూన్‌లో పుల్లయ్య మ్యూటేషన్‌కు దరఖాస్తు చేయగా.. తహసీల్దార్‌ ఇరవై రోజుల్లోగా దానికి ఆమోదం తెలుపుతూ ఎకరా నాలుగు సెంట్ల భూమిని అక్రమంగా మ్యూటేషన్‌ చేసేశారు. ఇది తెలుసుకున్న మద్దయ్య కుమారుడు షాక్‌కు గురయ్యాడు. 05–10–2021వ తేదీన చనిపోయిన తన తండ్రి స్టేట్మెంట్‌ రికార్డు చేయడంపై నివ్వెరపోయాడు. తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పిదాలను తెలియజేస్తూ తనకు న్యాయం చేయాలంటూ జిల్లా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా నేటికీ న్యాయం జరగకపోవడం గమనార్హం.

పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు..

తమకు జరిగిన అన్యాయంపై మద్దయ్య కుమారుడు మల్లికార్జున పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో అప్పటి జేసీ నవ్య వెంటనే స్పందించి తహసీల్దార్‌కు ఫోన్‌ చేసి ఆరా తీశారు. బాధితుడికి న్యాయం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత బాధితులు తహసీల్దారును కలవగా వేరే భూమి తన పేరు మీద చేపిస్తామని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే బాధితులు ఆర్డీఓ సందీప్‌ కుమార్‌ను కలవగా అక్కడ కూడా న్యాయం జరగలేదు. తన కార్యాలయంలోనే ఆర్‌ఓఆర్‌ కేసు నడుపుతామని చెప్పి నెలలు గడుస్తున్నా, ఇప్పటికీ అతీగతి లేదు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక బాధితులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పైగా బాధితుడిని రెవెన్యూ అధికారులు అనేక విధాలుగా బెదిరించి.. తమ దారికి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని మల్లికార్జునపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

రిటైర్మెంట్‌ సమయంలో..

అక్రమ ముట్యేషన్లు, రీసర్వేలో లేని భూమిని ఉన్నట్లు రికార్డులు సృష్టించడం, ఒక రైతు మీద ఉన్న సర్వే నంబర్లు, మరొక రైతు పేరున చూపడం వంటి అనేక సమస్యలకు అక్రమ మార్గంలో పరిష్కారం చూపడం ద్వారా సదరు రెవెన్యూ అధికారి భారీగా ఆక్రమార్జనకు పాల్పడ్డారనే ఆరోపణలు రెవెన్యూ వర్గాల్లో వినిపిస్తోంది. రిటైర్మెంట్‌కు దగ్గలో ఉన్న ఆ అధికారి అందినకాడికి దోచుకుంటున్నారని వారు గుసగుసలాడుతున్నారు. తన వాహన చోదకుడి ద్వారానే ఆయన ఈ తంతు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.


Next Story