భూముల వర్గీకరణపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం

by Thanuru Gopichand |

రాజధాని అమరావతి పరిధిలోని భూముల వర్గీకరణ అంశంపై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

భూముల వర్గీకరణపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్ : రాజధాని అమరావతి పరిధిలోని భూముల వర్గీకరణ అంశంపై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఆర్డీఏ (CRDA) పరిధిలోని భూములను మెట్ట, జరీబుగా వర్గీకరించిన విధానంపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియలో గతంలో జరిగిన లోపాలను సరిదిద్దేందుకు, ముఖ్యంగా జరీబు భూముల గుర్తింపును పున: పరిశీలించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గుంటూరు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పని చేయనుంది. గుంటూరు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పనిచేసే ఈ కమిటీలో రెవెన్యూ శాఖ అధికారులతోపాటు సీఆర్డీఏ అధికారులు కూడా సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. భూమి రకాన్ని బట్టి రైతులకు అందే పరిహారం, ప్యాకేజీల్లో వ్యత్యాసం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భూముల వర్గీకరణ రైతులకు అత్యంత కీలకంగా మారింది.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి భూ రికార్డులను, గతంలో జరిగిన వర్గీకరణను క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఎక్కడైనా అర్హత ఉన్న భూములకు జరీబు హోదా దక్కకపోయినా, పొరపాట్లు జరిగినా వాటిని గుర్తించి నివేదిక సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణ ప్రక్రియను వేగవంతం చేసి, రాబోయే 45 రోజుల్లోగా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల గత కొంతకాలంగా భూ వర్గీకరణ విషయంలో అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులకు ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. నివేదిక అనంతరం అర్హులైన రైతులకు మేలు చేకూర్చేలా తదుపరి చర్యలను ప్రభుత్వం చేపట్టనుంది.

Next Story