- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టాఫ్ నర్స్ ఆత్మహత్యా యత్నం
అధికారుల వేధింపుల కారణంగానే అని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు.

దిశ, వెబ్ డెస్క్ : కృష్ణా జిల్లాలో (Krishna District) తీవ్ర పనిభారం, ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఓ స్టాఫ్ నర్స్ (Staff Nurse) ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కాజ అనిత గత నాలుగేళ్లుగా ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త శ్రీకాంత్, కుమారుడు ఆనంద్‌కుమార్ ఇద్దరూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో అనిత గుడివాడలోని (Gudivada) తన అత్తమామల వద్ద ఉంటూ అక్కడి నుంచే ప్రతిరోజూ విధులకు హాజరవుతున్నారు. అయితే గత నాలుగు నెలలుగా ఆమె విధుల్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొత్తగా వచ్చిన వైద్యాధికారిణి అనితకు విరామం లేకుండా రాత్రింబవళ్లు వరుస డ్యూటీలు వేస్తున్నారని పేర్కొంటున్నారు. కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి కనీసం ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. అధికారుల టార్చర్, పని ఒత్తిడితో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారని అంటున్నారు.
ఈ క్రమంలో వేధింపులు భరించలేకపోయిన అనిత శుక్రవారం రాత్రి డ్యూటీలో ఉండగానే పెద్ద మొత్తంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గమనించిన తోటి సిబ్బంది హుటాహుటిన చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడిందని వైద్యులు తెలిపారు. విధులు నిర్వహించడం కంటే చావడమే మేలు అనే స్థాయికి తన కూతురిని తీసుకెళ్లిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అనిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తన వ్యక్తిగత బాధలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా, కావాలనే మెమోలు ఇస్తూ వేధిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రజా సంఘాలు సభ్యులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపించి బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతున్నారు.






