వరల్డ్ క్లాస్ స్టేడియంకు మళ్లీ పనులు.. రూ.1.80 కోట్లు కేటాయింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-25 11:22:26  IST  )

తాను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆత్మకూరులో క్రీడా ప్రాంగణం పనులు చేపట్టామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ..

వరల్డ్ క్లాస్ స్టేడియంకు మళ్లీ పనులు.. రూ.1.80 కోట్లు కేటాయింపు
X

దిశ, వెబ్ డెస్క్: 2013లో తాను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆత్మకూరులో రూ.2 కోట్లతో క్రీడా ప్రాంగణాన్ని మంజూరు చేసి కొంతవరకు పనులు చేపట్టామని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వ హయాంలో రూ.1.80 కోట్లతో మళ్లీ పనులు ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. ఆత్మకూరు గురుకుల పాఠశాల సమీపంలో నిర్మించనున్న క్రీడా వికాస కేంద్రానికి మంత్రి ఆనం భూమి పూజ నిర్వహించారు.

మరిన్ని నిధులు సమీకరించి..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరిన్ని నిధులు సమీకరించి ఈ క్రీడా వికాస కేంద్రాన్ని వరల్డ్ క్లాస్ స్టేడియంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. 1984లో తాను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానం, మెడికల్ కళాశాలలకు ప్రహరీ గోడలు నిర్మించి భూములకు రక్షణ కల్పించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అదే విధంగా క్రీడా వికాస కేంద్రానికి కేటాయించిన భూములను కూడా భద్రపరచి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఆనం తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలో మెరికల్లాంటి ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, గొప్ప క్రీడాకారులుగా తయారుచేసేందుకు ఈ స్టేడియం వేదిక కావాలని మంత్రి ఆకాంక్షించారు. ఇందుకోసం వ్యాయామ ఉపాధ్యాయులు ప్రత్యేకంగా కృషి చేయాలని మంత్రి ఆనం సూచించారు.

Next Story