Nellore: బాబాయ్ చంద్రశేఖర్‌రెడ్డి సస్పెండ్‌పై విక్రమ్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
Nellore: బాబాయ్ చంద్రశేఖర్‌రెడ్డి సస్పెండ్‌పై విక్రమ్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మేకపాటి కుటుంబం ప్రత్యేక ముద్ర వేసుకుంది. సీనియర్ నేత మేకపాటి రాజమోహనరెడ్డి 1985లో ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2012 వరకూ కూడా ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం మేకపాటి రాజమోహనరెడ్డి వైసీపీలో చేరారు. ఆ తర్వాత రాజమోహనరెడ్డి వారసుడు మేకపాటి గౌతమ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేశారు. అయితే గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే మేకపాటి రాజమోహనరెడ్డి సొదరుడు చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆయన బాటలోనే నడిచారు. 1999లో ఉదయగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఓటమి తర్వాత 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. అప్పటి నుంచి కూడా వైసీపీ అధిష్టానం, ఉదయగిరి వైసీపీ కార్యకర్తలపై ఆయన మాటలు తూటాలు పేల్చుతున్నారు. వైసీపీ నేతల సవాల్‌ను కూడా స్వీకరించి ప్రతి సవాల్ సైతం విసిరారు. అయితే అన్న రాజమోహనరెడ్డిపై చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న రాజమోహనరెడ్డి పగబట్టారని వ్యాఖ్యానించారు. అన్నదమ్ముల్లో ఇలా ఉంటారని తాను అనుకోలేదని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.

ఈ వ్యాఖ్యలపై రాజమోహనరెడ్డి కుమారుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పరిణామాలతోనే చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేశారన్నారు. పార్టీలో తప్పు జరిగితే ఎవరైనా ఒకటేనని చెప్పారు. బాబాయ్ చంద్రశేఖర్ రెడ్డికి సీఎం జగన్ ద్రోహం చేయాలని అనుకోలేదన్నారు. ఉదయగిరిలో కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహించేంది ఇప్పుడే చెప్పలేమని విక్రమ్‌రెడ్డి తెలిపారు.

Next Story