ఆదర్శ మెనూకు ధరాఘాతం

by Dishafeatures2 |
ఆదర్శ మెనూకు ధరాఘాతం
X

దిశ, నెల్లూరు జిల్లా కందుకూరు: మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా మారింది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజవర్గంలో అంగన్వాడీల పరిస్థితి. వైయస్సార్ సంపూర్ణ పోషణలో భాగంగా గర్భిణీలు, బాలింతలు చిన్నారులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనం అమలు అవస్థలు పడాల్సి వస్తోంది. ఆదర్శ మెనూ అమలులో భాగంగా అవసరమైన పోపు సామాగ్రి సమకూర్చుకోవడం సవాలుగా మారింది. కూరగాయల ధరలు ఆకాశానికి అంటుతుండడం, ప్రభుత్వం చెల్లించే ధర సరిపోక పోవడం, కేంద్రాలకు చెల్లించవలసిన కూరగాయలు పోపు సామాగ్రి బిల్లులు నెలలు తరబడి రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అంగనవాడీ కార్యకర్తలు చెబుతున్నారు.

మెనూ ఘనం.. చెల్లింపు నామమాత్రం

సోమవారం నుంచి శనివారం వరకు రోజు చిన్నారులకు 100 ఎంఎల్, గర్భిణీలు బాలింతలకు 200 ఎంఎల్ పాలతో పాటు ఉడికించిన గుడ్డుతో కలిపి రోజుకో విధంగా దోసకాయ బీరకాయ టమోటా ఆకు కూర పప్పు కూర కూరగాయలతో సాంబార్, వెజిటేబుల్ రైస్ లాంటివి వండి పెట్టాలని మెనూలో నిర్దేశించింది. అందుకు చిన్నారికి రోజుకు కూరగాయలకు ఒక్క రూపాి 25 పైసలు, పోపు సామాగ్రికి 25 పైసల చొప్పున లెక్కపెట్టి అంగన్వాడి కార్యకర్తలకు చెల్లిస్తోంది ప్రభుత్వం. గర్భిణీలు, బాలింతలకు రోజుకు ఒక్కొక్కరికి కూరగాయలకు మూడు రూపాయలు, పోపు 75 పైసలు చొప్పున చెల్లిస్తోంది.

ప్రస్తుతం కిలో టమోటా 100 రూపాయల నుంచి 150 వరకు ధర పలుకుతున్నాయి. మిగిలిన కూరగాయలు గతంలో పోలిస్తే అంతకు మించి పెరిగాయి. ఇతర నిత్యవసర సరుకులది అదే పరిస్థితి. ఈ క్రమంలో ఆదర్శ మెనూ అమలు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఉద్దేశించిన మెనూ సజీవంగా సాగాలంటే ధరలు పెంచాలని అంగనవాడీ కార్యకర్తలు కోరుతున్నారు.


Next Story