ఓడితే చచ్చామే!

by Dishanational1 |
ఓడితే చచ్చామే!
X

రాష్ట్రంలో నాలుగేళ్ల నుంచి రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి అడిగితే పోలీసులను ఉసిగొల్పుతున్నారు. సీఎం పర్యటనలప్పుడు విపక్ష నేతలను నిర్బంధిస్తున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ ఫ్యాక్షన్​పోకడలేంటని విపక్షాలు నిలదీస్తున్నాయి. ఇదే సమయంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీ సర్కారును కోలుకోలేని దెబ్బతీశాయి. ప్రభుత్వ నిరంకుశ పాలనపై గ్రాడ్యుయేట్లు ఓటు ద్వారా నిరసన తెలిపారు. మా ప్రభుత్వ తీరుపై విద్యావంతులు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో సమీక్షించుకుంటామని వైసీపీ సీనియర్​నేత బాలినేని శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఆయన తప్ప సీఎంతో సహా మిగతా వారిలో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న ఆలోచన ఏమాత్రం కనిపించడం లేదు. వ్యతిరేకించే వర్గాలు విపక్షాలకు వైపు మరలకుండా మరింతగా ఎదురుదాడి చేయాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ ఎక్కడకు దారితీస్తాయో.. ఈ దఫా గెలుస్తామో లేదోనన్న దిగులు పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఒకవేళ టీడీపీ గెలిస్తే తమ పరిస్థితి ఏమిటోనన్న భయమూ వ్యక్తమవుతోంది.

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రిగా జగన్​ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే సంక్షేమ పథకాల పేరిట ఓటు బ్యాంకులను సృష్టించుకోవాలనే లక్ష్యంతో వైసీపీ పాలన సాగింది. నవరత్నాలే మళ్లీ అధికారాన్ని కట్టబెడతాయనే విశ్వాసంతోనే ఉన్నారు. అన్ని శాఖల నిధులనూ అటువైపే మళ్లిస్తూ వచ్చారు. మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాల పెంపును గాలికొదిలేశారు. దీంతో రాష్ట్ర ప్రజల్లో సంక్షేమ ఫలాలు అందుకునేవాళ్లు మినహా మిగతా ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. అలాగని ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నవారిలోనూ సంతృప్తిలేదు. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్​ధరల పెంపుతోపాటు నిత్యావసరాలపై పన్నుల బాదుడు, విద్యుత్, రవాణా చార్జీలు సగటు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ఆదాయాలు పెరగకపోగా ఖర్చులు పెరిగాయి. ఈ ఆక్రోశం ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీసింది. అందుకే పట్టభద్రులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు, నిరుద్యోగులు, ఇతర అసంఘటిత రంగ కార్మికులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ద్వారా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. అధికార పార్టీని మూడు చోట్ల ఓడించారు.

సజ్జల రూటే సెపరేటు...

రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న వైసీపీ సీనియర్​నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ఫలితాలపై హుందాగా స్పందించారు. విద్యావంతులు తమ ప్రభుత్వం పట్ల ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారో సమీక్షించుకుంటామని అన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం గ్రాడ్యుయేట్లు అనే వాళ్లు కేవలం ఓ చిన్న వర్గం. సంక్షేమ పథకాలు అందని వర్గమంటూ తేల్చేశారు. ఓ రకంగా వాళ్లు తమ గెలుపును నిలువరించలేరనే సంకేతాలు ఇచ్చారు. దీని గురించి తాము అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. పార్టీ శ్రేణుల్లో ఆత్మ స్థయిర్యాన్ని నింపడానికి ఆయన అలా మాట్లాడి ఉండవచ్చు. క్షేత్ర స్థాయిలో వందకు పైగా ఎమ్మెల్యేలకు తల కొట్టేసినట్లుంది. అవమాన భారంతో ఉడికిపోతున్నారు. రానున్న ఎన్నికల్లో విపక్షాలు తమకు దరిదాపుల్లో కూడా ఉండరనే ఆత్మ విశ్వాసంపై నీళ్లు చల్లినట్లయింది. కింది స్థాయి కార్యకర్తల్లో సైతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నిద్ర లేకుండా చేశాయి. దీని నుంచి డైవర్ట్​చేయడం కోసమే అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు ఘర్షణకు దిగినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

నిలదీస్తే నిర్బంధమే...

ఎన్నికలకు ఇంకా ఏడాది పైగా సమయం ఉంది. మౌలిక సదుపాయాల కల్పన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగుల స్వయం ఉపాధికి నిధులు వెచ్చించే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు భావించాయి. తద్వారా మధ్య తరగతి వర్గంలో కూడా కొంతమేర అసంతృప్తిని తొలగించేందుకు వైసీపీ సర్కారు ప్రాధాన్యం ఇస్తుందనుకున్నారు. సీఎం జగన్ తీరు ఏ మాత్రం మారలేదు. హామీ అమలు గురించి అడిగినందుకు అంగన్​వాడీ కార్యకర్తలను పోలీసు స్టేషన్లలో నిర్బంధించారు. జీవో నెంబరు1 అప్రజాస్వామికమంటూ సభలో చర్చించాలన్న విపక్ష సభ్యులతో ఘర్షణకు దిగారు. ఇదే ఒరవడితో ముందుకు సాగితే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తీవ్రమయ్యే అవకాశముంది. ఇప్పటిదాకా విద్యావంతులు, మేథావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులే వ్యతిరేకంగా ఉన్నారు. ఇక నుంచి సామాన్య ప్రజలు కూడా ప్రభుత్వ తీరును ఈసడించుకునే అవకాశం లేకపోలేదు. ఇదే ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్​చార్జుల్లో గుబులు రేపుతోంది. గెలిస్తే సరి. ఓడితే ఎలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని వైసీపీ శ్రేణుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు తాము వేధిస్తున్నట్లే ఆ పార్టీ నేతలు తమను వేధిస్తారనే భయం నెలకొంది.

Read more:

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు కవిత, కేటీఆర్..


Next Story

Most Viewed