అరటి రైతుకు వార్ సెగ!

by velandi.Saikiran |   (  Updated:2026-03-15 22:45:23  IST  )

అదిగో యుద్ధం.. ఇదిగో ధరల తగ్గింపు అంటూ ట్రేడర్లు ఆడుతున్న మాయాజాలంలో కడప జిల్లా అరటి రైతు చిక్కుకుపోయాడు.

అరటి రైతుకు వార్ సెగ!
X

అరటి రైతుకు వార్ సెగ!

- యుద్ధం సాకుతో దళారుల దోపిడీ!

- టన్నుకు రూ. 10 వేలకు పైగా కోత

- పెట్టుబడి కూడా దక్కక కడప జిల్లా సాగుదారుల ఆవేదన

దిశ​, ప్రతినిధి కడప: అదిగో యుద్ధం.. ఇదిగో ధరల తగ్గింపు అంటూ ట్రేడర్లు ఆడుతున్న మాయాజాలంలో కడప జిల్లా అరటి రైతు చిక్కుకుపోయాడు. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట చేతికి వచ్చే సమయానికి, పశ్చిమాసియా ఉద్రిక్తతలను బూచిగా చూపి వ్యాపారులు ధరలను పాతాళానికి తొక్కేస్తున్నారు. నిన్నటి దాకా లాభాల బాటలో ఉన్న రైతు, నేడు కనీసం పెట్టుబడి కూడా వస్తుందో లేదో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాడు.

అంతర్జాతీయంగా సెగ.. స్థానికంగా దగా

​జిల్లాలో ప్రధానంగా పులివెందుల, లింగాల, వేముల, సింహాద్రిపురం మండలాల్లో అరటి సాగు విస్తారంగా జరుగుతోంది. ఇక్కడి అరటికి అరబ్ దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే, పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయన్న సాకుతో, ఎగుమతులు నిలిచిపోయాయని ట్రేడర్లు ప్రచారం చేస్తున్నారు. ​గత నెలలో టన్ను అరటి రూ. 25 వేల నుంచి రూ. 27 వేలు పలికింది. ప్రస్తుతం మొదటి క్రాప్ కేవలం రూ. 15 వేలు, రెండో క్రాప్ అయితే రూ. 10 వేలకే అడుగుతున్నారు. అంటే.. ఒక్క నెలలోనే టన్నుకు రూ.12 వేల వరకు ధర తగ్గించి రైతుల పొట్ట కొడుతున్నారు.

​పెట్టుబడి రూ. 1.50 లక్షలు.. వచ్చేది ఎంత?

​అరటి సాగుకు ఎకరాకు దాదాపు రూ. 1.50 లక్షల వరకు ఖర్చవుతోంది. ఎకరాకు 15 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తుందని ఆశించిన రైతులకు, ప్రస్తుత ధరలు చూస్తుంటే కన్నీళ్లే మిగులుతున్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ధరలు పెరుగుతాయని ఆశించిన రైతులను వ్యాపారుల సిండికేట్ కోలుకోలేని దెబ్బ తీస్తోంది.

పులివెందుల అరటి ప్రత్యేకత ఇదే..

​మిగిలిన ప్రాంతాల అరటి 8 రోజులు నిల్వ ఉంటే, పులివెందుల ప్రాంత అరటి 14 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. ఇక్కడి చౌడు నేలల వల్ల వచ్చే రుచి, నాణ్యతే దీనికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. ఇంతటి నాణ్యమైన పంట పండించినా, ధర విషయంలో మాత్రం రైతుకు అన్యాయం జరుగుతూనే ఉండటం గమనార్హం. యుద్ధం పేరుతో ధరలు తగ్గించే దళారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గిట్టుబాటు ధర కల్పించి, ఎగుమతులకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు.

Next Story