ఏపీలో మున్సిపల్ సంస్థలకు 'ప్రత్యేక' పాలన.. 11 కార్పొరేషన్లకు అధికారుల నియామకం!

by Ramesh Naini |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో నేటి నుంచి అధికారుల పాలన ప్రారంభం కానుంది.

ఏపీలో మున్సిపల్ సంస్థలకు ప్రత్యేక పాలన.. 11 కార్పొరేషన్లకు అధికారుల నియామకం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో నేటి నుంచి అధికారుల పాలన ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారులను (Special Officers) నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌ కుమార్ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియడంతో, పరిపాలనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి ఆరు నెలల పాటు లేదా కొత్త ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యే వరకు ఈ ప్రత్యేక అధికారులు పాలనా వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు.

ప్రత్యేక పాలనలోకి వెళ్లే ప్రధాన కార్పొరేషన్లు ఇవే..

రాష్ట్రంలోని కీలక నగరాల్లో పాలన ఇకపై అధికారుల పర్యవేక్షణలో సాగనుంది. ఆ జాబితాలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, ఒంగోలు, విజయనగరం, మచిలీపట్నం, చిత్తూరు వంటి ప్రధాన కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారుల పాలన సాగనుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయి. స్థానిక సంస్థల నిధుల వినియోగం, పౌర సేవలు మరియు అభివృద్ధి పనుల బాధ్యతలను ఈ అధికారులు స్వీకరించనున్నారు.

Next Story