గంజాయి ముఠాల నియంత్రణకు స్పెషల్ ఫోకస్

by Thanuru Gopichand |

గంజాయి రహిత మంగళగిరి పోలీసుల లక్ష్యం.

గంజాయి ముఠాల నియంత్రణకు స్పెషల్ ఫోకస్
X

దిశ, వెబ్ డెస్క్ : కూటమి ప్రభుత్వ ఆదేశాలతో గుంటూరు జిల్లాలోని మంగళగిరి పోలీసులు (Mangalagiri Police) గంజాయి నిర్మూలనపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. గత కొంతకాలంగా మంగళగిరిలోని అనుమానాస్పద ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా కార్డెన్ సెర్చ్ లను నిర్వహిస్తున్నారు. కేవలం గంజాయి వినియోగించేవారిని మాత్రమే కాకుండా విక్రయించే వారిని, సరఫదారులను కూడా గుర్తిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విషయం తీవ్రతను బట్టి కేసులు నమోదు చేస్తున్నారు. గంజాయి రహిత మంగళగిరి తమ లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు.

తమ స్పెషల్ ఫోకస్ (Special Focus) లో భాగంగా మంగళగిరి మండలంలోని కాజాలో శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు తనిఖీలను ప్రారంభించారు. కాజాలోని పుల్లయ్యనగర్ ను అన్ని వైపుల నుంచి నిర్బంధించారు. పదుల సంఖ్యలో పోలీసులు మొహరించి ఇంటింటికి వెళ్లి సోదాలు చేపట్టారు. ప్రధానంగా గంజాయి విక్రేతలుగా అనుమానిస్తున్న వారి ఇండ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

గత కొద్ది రోజుల క్రితం..

మంగళగిరి పోలీసులు గత కొద్ది రోజుల క్రితం గండాలయ్యపేటలోని వంద ఇండ్లల్లో సోదాలు చేశారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలను చేపట్టారు. స్థానికంగా యువత గంజాయి సేవించడం, విక్రయించడం చేస్తున్న అనుమానాల నేపథ్యంలో తనిఖీలను నిర్వహించారు. ఎటువంటి గుర్తింపు లేని 80 వాహనాలను సీజ్ చేశారు. అనుమానితుల వివరాలను సేకరించారు. అనంతరం స్థానిక యువతతో గంజాయికి దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు.

ప్రజల సహకారం అవసరం

గంజాయి నిర్మూలనలో ప్రజల సహకారం అత్యంత అవసరం అని పోలీసులు అంటున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. పోలీసుల తరపున కార్డన్ అండ్ సెర్చ్, ఆకస్మిక తనిఖీలు, గంజాయి వద్దు బ్రో అనే నినాదంతో ప్రతిజ్ఞలు చేయిస్తున్నాం అని చెబుతున్నారు. ప్రజలు కూడా తమవారు గంజాయికి బానిసైనా, గంజాయి క్రయవిక్రయాలపై సమాచారం ఉన్నా తమకు తెలియజేయాలంటున్నారు. తద్వారా గంజాయి రహిత మంగళగిరి సాకారాన్ని వేగవంతం చేయాలని పిలుపునిస్తున్నారు.

Next Story