- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్యశాఖలో ‘సార్ స్టైల్’ దుమారం.. కార్యదర్శి మార్పు ఖాయమా?
వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి మార్పుపై ఆశాఖ ఉద్యోగుల్లో వాడివేడి చర్చ సాగు తోంది. ఆరు నెలల క్రితమే వైద్యశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్ బాధ్యతలు చేపట్టారు.

దిశ, ఏపీ బ్యూరో : వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి మార్పుపై ఆశాఖ ఉద్యోగుల్లో వాడివేడి చర్చ సాగు తోంది. ఆరు నెలల క్రితమే వైద్యశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్ బాధ్యతలు చేపట్టారు. సమీక్షల సందర్భంగా విభాగాధిపతులపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్న సౌరభ్ సార్.. తమను ఏ మాత్రం గౌరవంగా చూడటం లేదని అధికారులు గగ్గోలు పెడుతున్నారు. అసలు హెల్త్ డిపార్ట్‌మెంటే బాగోలేదంటూ సౌరభ్‌గౌర్ తరుచు చిర్రుబుర్రులాడుతుండటంతో ఇప్పటికే కొందరు అధికారులు సెలవుపై వెళ్ళిపోయారు. అత్యంత కీలకమైన వైద్య ఆరోగ్యశాఖలో మున్నెన్నడూ లేని విధంగా పాలనా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో సౌరభ్‌గౌర్‌ను వైద్యశాఖ కార్యదర్శి పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతల్ని ఐటీ ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ కు అప్పగించలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా భాస్కర్ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో ఆయనకు వైద్యశాఖ కార్యదర్శి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం వైద్య ఆరోగ్యశాఖలో జోరుగా సాగుతోంది.
సెలవుపై డీఎంఈ..
డీఎంఈ రఘునందన్ సెలవుపై వెళ్ళారు. గత కొద్ది రోజులుగా డీఎంఈ పనితీరుపై సౌరభ్ గౌర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో సమీక్షల సందర్భంగా పలుమార్లు విరుచుకు పడ్డట్లు సమాచారం. ఒకదశలో పరుష పదజాలాన్ని ఉపయోగించారని ఉద్యోగ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇటీవల సమీక్ష సందర్భంగా ఇలా అయితే కష్టం అంటూ సౌరభ్ గౌర్ హెచ్చరించడంతో నో ఇష్యూ సార్ నేనే సెలవుపై వెళ్ళిపోతాను.. అని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే డీఎంఈ ఈనెల 15వ తేదీ వరకు సెలవుపై వెళ్ళినట్లు తెలుస్తోంది. అడిషనల్ డీఎంఈ రాధిక రెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. డీఎంఈ రఘునందన్ తిరిగి వచ్చే అవ కాశం లేదని, ఆయన స్థానంలో కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం డీఎంఈ కార్యాలయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గతంలో డ్రగ్ కంట్రోల్ విభాగంలో ఓ ఉద్యోగి కూడా ఇలానే సెలవుపై వెళ్ళారు. మొత్తం మీద సౌరభ్ గౌర్ వచ్చాక తమకు గౌరవం లేకుండా పోయిందన్నది వైద్యశాఖ ఉద్యోగుల ఆవేదన. ఈ క్రమంలో ఆయన్ను త్వరలోనే వైద్యశాఖ కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.






