ఎన్నాళ్లు... ఎన్నేళ్లు..?

by Disha Web Desk 12 |
ఎన్నాళ్లు... ఎన్నేళ్లు..?
X

వైఫ్ ఆఫ్ వైఎస్ జగన్.. ఇది జగన్ మీడియాలో గతంలో పేరొందిన ఓ శీర్షిక పేరు. నాడు అక్రమార్జన కేసులలో జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య భారతి రెడ్డి తమ సొంత పత్రికలో నిర్వహించిన ఫీచర్ అది. జగన్ దూరం కావడం వల్ల తమ కుటుంబం అనుభవిస్తున్న క్షోభను ఆమె ఆ శీర్షిక ద్వారా వ్యక్తపరిచారు. పదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు జగన్ సీఎం అయ్యారు. భారతీ రెడ్డి సంతోషంగా ఉన్నారు. కానీ, జగన్ పాలనలో వేలాది మంది ఉద్యోగులు తమ కుటుంబాలకు దూరంగా బతుకీడుస్తున్నారు. భార్య ఒక చోట, భర్త మరొకచోట ఉద్యోగం చేస్తూ రోజులు నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వ నిర్వాకమే వారి దుస్థితికి కారణం. మరి, వీరి గోడు వినేదెవరు?

దిశ, కర్నూలు ప్రతినిధి: గ్రామీణ ప్రాంత ప్రజలకు గ్రామాల్లోనే సేవలందించేందుకు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ మెరుగైన ఫలితాలనిస్తోంది. అయితే ప్రజలకు సేవలందించే సచివాలయ ఉద్యోగులు మాత్రం కుటుంబాలకు దూరంగా బతుకీడుస్తున్నారు. ఒక ప్రాంతంలో భర్త, మరో ప్రాంతంలో భార్య ఇలా సచివాలయాలు కేటాయించడంతో విధుల నిర్వహణ మరింత భారమైంది. సుదూర ప్రాంతాల్లో పని చేయాల్సి ఉండడంతో వచ్చే వేతనాలు సగం రవాణా ఖర్చులకే సరిపోతున్నాయి. దీంతో కుటుంబాలను నెట్టుకు రావడం కష్టతరంగా మారింది.

రాష్ట్ర వ్యాప్తంగా 15,031 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఒక్కో సచివాలయంలో గ్రామ పోలీసు, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, అగ్రి అసిస్టెంట్, ఫిషరీష్, వెటర్నరీ అసిస్టెంట్, గ్రామ సర్వేయర్, జూనియర్ లైన్ మ్యాన్, ఇంజనీర్ అసిస్టెంట్, ఏఎన్ఎం, సెరికల్చర్ అసిస్టెంట్.. ఇలా పది నుంచి 12 మంది చొప్పున సచివాలయ ఉద్యోగులున్నారు.

ఈ లెక్కన రాష్ర్ట వ్యాప్తంగా 1,50,310 మంది సచివాలయ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిపై పర్యవేక్షణకు ప్రతి సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారి ఉంటారు. అంటే రాష్ట్రంలో 30,062 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు ఉంటారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులు

సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరి మూడేళ్లైనా నేటికీ వారు బదిలీ మాట ఎరుగరు. విధుల్లో చేరింది మొదలుకొని ఇప్పటివరకు బదిలీల కోసం ఎదురు చూడడమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. భార్య, భర్త వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తుండడంతో పిల్లలు, కుటుంబ సభ్యుల సంరక్షణ పెను సమస్యగా, ఆర్థిక భారంగా మారింది. సెలవు రోజున కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి రావడం వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడం వారిని మరింత కుంగదీస్తోంది.

తప్పని వేధింపులు

సచివాలయ ఉద్యోగులకు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల వేధింపులు తప్పడం లేదు. ప్రతి సోమవారం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే స్పందన కార్యక్రమంలో ప్రతి శాఖకు చెందిన ఉద్యోగులు పాల్గొనాలి. కానీ అందులో కొందరికి స్పందన కార్యక్రమంలో పాల్గొనడం వల్ల పనిభారం పెరిగే అవకాశం ఉంది. అందులో ఫిషరీష్అ సిస్టెంట్లు ప్రతి రోజు గ్రామాల్లో పర్యటించకపోతే అనుకున్న లక్ష్యాలు సాధించలేరు.

అయితే స్పందనకు రావాలని అడ్మిన్లు, ఇతర ఉన్నతాధికారులు ఆదేశాలిస్తే ఆ శాఖకు సంబంధించిన జిల్లా అధికారులు ఫీల్డ్ కు వెళ్లకపోవడం వల్ల లక్ష్యాలు అధిగమించలేదని ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా నోటీసులు జారీ చేయడం పరిపాటిగా మారింది. అలాగే, స్పందన కార్యక్రమంలో పాల్గొనని కారణంగా ఇక్కడి అధికారులు హెచ్చరికలు, నోటీసులు జారీ చేయడంతో దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు.

ఇవన్నీ చాలవన్నట్లు ప్రతి శాఖకు సంబంధించిన ఉద్యోగులు స్థానిక రాజకీయ నాయకులు, మండల, నియోజకవర్గ స్థాయి నాయకుల ఒత్తిళ్లతో మరింత కుంగుబాటుకు గురౌతున్నారు. ప్రభుత్వం స్పందించి వేధింపులు అరికట్టి వెంటనే బదిలీలు చేపట్టాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు.


Next Story

Most Viewed