తిరుమల దర్శనం పేరుతో సీఐని మోసం చేసిన కేటుగాళ్లు

by Thanuru Gopichand |

సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) ఎంతటి వారినైనా బురిడీ కొట్టించగలమని మరోసారి నిరూపించారు.

తిరుమల దర్శనం పేరుతో సీఐని మోసం చేసిన కేటుగాళ్లు
X

దిశ, వెబ్ డెస్క్ : సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) ఎంతటి వారినైనా బురిడీ కొట్టించగలమని మరోసారి నిరూపించారు. సామాన్యులను పక్కన పెట్టి, ఏకంగా సైబర్ నేరాలను అరికట్టే విభాగంలో పనిచేస్తున్న అధికారులనే తమ వలలో చిక్కుకునేలా చేశారు. రాచకొండ సైబర్ క్రైమ్ విభాగంలో ఇన్ స్పెక్టర్లుగా (Cyber Crime Inspectors) విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు అధికారులు సైబర్ మాయగాళ్ల చేతిలో మోసపోయి ఏకంగా రూ. 43 లక్షల వరకు పోగొట్టుకోవడం ప్రస్తుతం పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారింది. వీరిలో ఒకరు ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో భారీగా నష్టపోగా, మరొకరు భక్తి ముసుగులో జరిగిన మోసానికి బాధితుడిగా మారారు. ఈ ఘటనలు నేరస్తుల చాకచక్యాన్ని, వారు అనుసరిస్తున్న ఆధునిక పద్ధతులను స్పష్టం చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సైబర్ నేరాలను అరికట్టడంతో పోలీసులు కూడా ముందుంటున్నారు. పైకి మోసంలా కనిపిస్తున్నప్పటికీ నేరస్తులను పట్టుకోవడానికి పోలీసులు పన్నిన వ్యూహం కూడా కావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

ట్రేడింగ్ పేరుతో మోసం

రాచకొండ సైబర్ క్రైమ్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక సీఐకి ఆన్‌లైన్ ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు వస్తాయంటూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆశ చూపారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా పరిచయమైన వారు, నకిలీ ట్రేడింగ్ యాప్‌లతో నమ్మించి ఆయనతో పెట్టుబడులు పెట్టించారు. ఆరంభంలో లాభాలు వస్తున్నట్లు నమ్మించి, విడతల వారీగా సుమారు రూ. 39 లక్షలు వసూలు చేశారు. తీరా నగదు డ్రా చేసుకుందామనేసరికి సాంకేతిక కారణాలు చెప్పి అదనపు నగదు డిమాండ్ చేయడంతో తాను మోసపోయానని సదరు అధికారి గుర్తించారు. దీంతో నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు అందజేశారని తెలుస్తోంది.

శ్రీవారి పేరిట టోకరా

తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో మరో సీఐని కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. నిందితుడు తాను ఒక రిటైర్డ్ అదనపు ఎస్పీనంటూ పరిచయం చేసుకుని, తనకు టీటీడీలో ఉన్నత స్థాయి పరిచయాలు ఉన్నాయని నమ్మించాడు. ప్రోటోకాల్ దర్శనం, విమాన టిక్కెట్లు, తిరుమలలో గదులు కేటాయిస్తామంటూ నమ్మించి బాధితుడి నుంచి రూ. 4 లక్షలు వసూలు చేశాడు. చివరి నిమిషం వరకు ఏమాత్రం అనుమానం రాకుండా ప్లాన్ చేసిన నిందితుడు, డబ్బులు తీసుకున్న తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. చివరకు తాను మోసపోయానని గ్రహించిన సీఐ, తాను పనిచేస్తున్న స్టేషన్‌లోనే స్వయంగా ఫిర్యాదు చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ రెండు కేసులపై నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఉన్నతాధికారులు లోతైన దర్యాప్తుకు ఆదేశించారని సమాచారం.

Next Story