Viveka Case: అవినాశ్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం

by Disha Web Desk 16 |
Viveka Case: అవినాశ్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లికి గుండెపోటు వచ్చింది. దీంతో సీబీఐ విచారణకు హాజరుకాకుండా హుటాహుటిన తాడిపత్రికి వెళ్లారు. అయితే అవినాశ్ రెడ్డి విచారణకు హాజరుకాకపోవడంతో సీబీఐ అధికారులు సీరియస్ అయ్యారు. అవినాశ్ రెడ్డి కారు వెంట కొంత దూరం వెళ్లి మళ్లీ హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు.

అయితే అవినాశ్‌రెడ్డిని అరెస్ట్ చేస్తారనే భయంతో తప్పించుకునే ప్రయత్నం చేశారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సీబీఐ విచారణకు హాజరయ్యే ఉద్దేశంతోనే అవినాశ్ రెడ్డి హైదరాబాద్ వచ్చారని, తల్లి ఆరోగ్యం బాగలేకపోవడంతోనే ఆయన విచారణకు హాజరుకాలేకపోయారని.. ఆ విషయాన్ని సీబీఐ అధికారులకు అవినాశ్ రెడ్డి సమాచారం ఇచ్చే ఉంటారని పేర్కొన్నారు.

అవినాశ్ రెడ్డి ఎక్కడికీ పారిపోలేదని తెలిపారు. తప్పించుకోవాల్సిన అవసరం అవినాశ్ రెడ్డికి లేదన్నారు. సీబీఐ విచారణకు పిలిచిన తర్వాత ఇవాళ కాకపోయినా రేపైనా వెళ్లాల్సిందేనని చెప్పారు. వివేకానందారెడ్డి హత్య కేసులో నిందితుడిగా చేర్చిన తర్వాతే కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. కొందరు అవినాశ్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏదో జరిగిపోతుందంటూ కొందరు హడావుడి చేస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి : Kadapa: ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ అత్యుత్సాహం

Next Story

Most Viewed