ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారుల చర్యలు

by Thanuru Gopichand |

పండుగొస్తే దోపిడీకి తెరలేపుతున్న వ్యాపారులు.

ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారుల చర్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : సంక్రాంతి (Sankranti) పండుగ వేళ ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుని అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ (RTA) అధికారులు ఉక్కుపాదం మోపారు. జనవరి 9 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకున్నారు. పండుగ రద్దీని ఆధారం చేసుకొని, సాధారణ చార్జీల కంటే అధికంగా వసూలు చేస్తున్న 548 బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో చార్జీలను పర్యవేక్షిస్తూ, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు నిరంతర తనిఖీలు చేస్తూ చర్యలు తీసుకున్నారు.

​గత 10 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,348 ప్రైవేట్ బస్సులపై వివిధ నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదయ్యాయి. ఈ దాడుల ద్వారా రవాణా శాఖ సుమారు రూ.71.29 లక్షల జరిమానాను వసూలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సులతో పాటు, ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు లేని వాహనాలను కూడా అధికారులు సీజ్ చేశారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్‌పై పెద్ద ఎత్తున కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చిన రవాణా శాఖ, భవిష్యత్తులోనూ ఇటువంటి అక్రమ వసూళ్లపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది.

Next Story