AP Weather: భారీ వర్షాలు, ఏపీ జిల్లాలకు రెడ్ అలర్ట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-05 03:22:51  IST  )

మండుటెండలకు ఉపశమనంగా ఏపీలో వర్షాలు (AP Rains) కురుస్తున్నాయి. కానీ.. అకాల వర్షాల వల్ల రైతన్నలు లబోదిబోమంటున్నారు.

AP Weather: భారీ వర్షాలు, ఏపీ జిల్లాలకు రెడ్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మండుటెండలకు ఉపశమనంగా ఏపీలో వర్షాలు (AP Rains) కురుస్తున్నాయి. కానీ.. అకాల వర్షాల వల్ల రైతన్నలు లబోదిబోమంటున్నారు. పంట చేతికివచ్చే సమయంలో, ధాన్యం ఆరబోసిన సమయంలో వర్షాలు కురుస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్రంలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. కొన్నిప్రాంతాల్లో 41-42 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదైనా.. మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

మే 5,6 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు (Thunderstorms), బలమైన ఈదురు గాలులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అనకాపల్లి, ఉభయగోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూల్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఆదివారం (మే4) నంద్యాల జిల్లా గోనవరంలో 42.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లా సోమశిలలో 42.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తు నిర్వహణ శాఖ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఇక ఆదివారం సాయంత్రం వరకు కాకినాడ జిల్లా కాజులూరులో 110.5 మి.మీ, చొల్లంగిపేటలో 94.5, కరపలో 75.5 మి.మీ, కాకినాడలో 66.7 మి.మీ చొప్పున 130 ప్రాంతాల్లో 20మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.

అకాల వర్షాల కారణంగా 8 మంది మరణించారు. పిడుగులు పడి ఆరుగురు మృతి చెందగా.. చెట్టుకూలి ఓ బాలుడు, విద్యుదాఘాతంతో మరొకరు మరణించారు. ఈదురుగాలులు, భారీ వర్షానికి వేలాది ఎకరాల్లో మామిడి, వరి, బొప్పాయి, మొక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు సైతం అంతరాయం కలిగింది.

Next Story