శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లాల వరకూ రెడ్ అలర్ట్.. "మొంథా" అంటే అర్థమేంటో తెలుసా?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-31 13:42:05  IST  )

గడిచిన 6 గంటల్లో మొంథా తుపాన్ 18 కిలోమీటర్ల వేగంతో కదులుతూ.. చెన్నైకి 520, కాకినాడకు 570, విశాఖపట్నంకు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై

శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లాల వరకూ రెడ్ అలర్ట్.. మొంథా అంటే అర్థమేంటో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ జిల్లాల్లో మొంథా తుపాను ప్రభావం ప్రారంభమయింది. ఉదయం ఎండ కనిపించినా కాసేపటికే ఆకాశాన్ని మబ్బులు కమ్ముకున్నాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కాకినాడ, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో నీరు నిలిచింది. బలమైన ఈదురుగాలులతో పాటు కురుస్తున్న భారీ వర్షానికి పట్టపగలే చీకట్లు కనిపిస్తున్నాయి. వర్షం తీవ్రత పెరగడంతో నిజాంపట్నం హార్బర్ లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

గడిచిన 6 గంటల్లో మొంథా తుపాన్ 18 కిలోమీటర్ల వేగంతో కదులుతూ.. చెన్నైకి 520, కాకినాడకు 570, విశాఖపట్నంకు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ తుపాను పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి ఈదురుగాలుల తీవ్రత గంటగంటకూ పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. అవసరమైన వారు APSDMA కంట్రోల్ రూమ్ నంబర్లు 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాలని సూచించింది.

మరోవైపు తుపాను తీరప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపనుండటంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకూ వాతావరణశాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాయలసీమ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. 24 గంటల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. దీంతో తీరప్రాంత జిల్లాల్లో అధికార యంత్రాంగం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

కాగా.. సైక్లోన్ కు మొంథా అనే పేరును థాయ్ ల్యాండ్ సూచించినట్లు వాతావరణ విభాగం తెలిపింది. థాయ్ భాషలో మొంథా అంటే సువాసన కలిగిన పుష్పమని అర్థమట. విధ్వంసం సృష్టించే తుపానుకు సువాసన కలిగించే పుష్పమని అర్థమొచ్చే పేరు పెట్టడం ఏంటోనని ఈ విషయం తెలిసినవారు చర్చించుకుంటున్నారు.

Next Story