పాలీష్ మాయ.. అధికార పార్టీ నేతల జేబులు నింపుతోన్న చౌక బియ్యం

by Disha Web Desk 7 |
పాలీష్ మాయ.. అధికార పార్టీ నేతల జేబులు నింపుతోన్న చౌక బియ్యం
X

పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు అడ్డంగా బొక్కుతున్నారు. నిర్భాగ్యుల ఆకలి కంచంలో మెతుకులను అన్యాయంగా గతుకుతున్నారు. అధికారుల కళ్లకు మామూళ్ల గంతలు కట్టి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడ పాలిష్ పట్టించి తిరిగి వివిధ బ్రాండ్ల పేరుతో అధిక ధరలకు అమ్ముకుంటూ మధ్య తరగతి జేబులు కొట్టేస్తున్నారు. ఈ అక్రమాలకు అధికార పార్టీ నేతలే కొమ్ము కాస్తూ వాటాలు పంచుకుంటున్నారు.

దిశ ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 12.21 లక్షల రేషన్ కార్డులు, మూడు వేల చౌకధర దుకాణాలు ఉన్నాయి. నల్లమాడ మండలంలోని ఓ మిల్లులో అక్రమంగా తరలించిన రేషన్ బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ పలుమార్లు బియ్యం పట్టుబడింది. మిల్లు యజమానిపై నల్లమాడ, ఓడీసీ, అమడగూరు, బాగేపల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీరికి రాజకీయ పలుకుబడి ఉండటంతో చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనకాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. సదరు మిల్లులో నిల్వ చేసిన బియ్యాన్ని రాత్రి వేళలో కర్ణాటకకు తరలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

ప్రజాప్రతినిధుల అండతో..

రాయదుర్గం నియోజకవర్గంలో ఓ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యురాలి అండతో బియ్యం అక్రమ రవాణా సాగుతున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ నియోజకవర్గానికి ఆనుకొని కర్ణాటక సరిహద్దుగా ఉండడంతో ఈ తంతు నిరంతరాయంగా కొనసాగుతున్నట్లు సమాచారం. కర్ణాటకకు చెందిన కొంతమంది వ్యాపారులు ఆమెకు నెలనెలా మామూళ్లు చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఇక బొమ్మనహాళ్, కణేకల్లు, గుమ్మఘట్ట, డి. హీరేహాళ్ మండలాల నుంచి రేషన్ బియ్యాన్ని ఆటోల్లో రాయదుర్గం సమీపంలో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రి వేళ లారీల ద్వారా బళ్లారిలోని మిల్లులకు తరలిస్తున్నారు. ఫిబ్రవరి నెల 11న డి.హీరేహాళ్ మండలం జాజరకల్ టోల్ ప్లాజా వద్ద 150 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు.

తూకంలో మాయ

అనంతపురం సాయినగర్ లోని ఓ డీలర్ ప్రతికార్డుపై బియ్యం తక్కువ తూకం వేసి ఇస్తున్నట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. దాని గురించి ఎవరైనా ప్రశ్నిస్తే దిక్కున్నచోట చెప్పుకోండి అంటూ దౌర్జన్యం చేస్తున్నారని వాపోతున్నారు. ఇతనికి స్థానిక వైసీపీ నాయకుల అండదండలు ఉండడంతో రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. ఇలా పేదల నుంచి నొక్కేసిన బియ్యాన్ని కేజీ రూ.20 చొప్పున వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ప్రతి నెలా రూ.50 వేలు జేబులో ఇలా అక్రమ దందా చేస్తున్నట్లు సమాచారం.

సేకరించి.. తరలించి..

కొందరు డీలర్లు లబ్ధిదారులకు బియ్యం బదులు నగదు ఇస్తున్నారు. మరి కొందరు ప్రతి కార్డుపై కేజీ నుంచి రెండు కేజీల బియ్యాన్ని కాజేస్తున్నారు. మరోవైపు ప్రతి నెలా పంపిణీ ప్రక్రియ ముగిసిన వెంటనే లబ్ధిదారుల వద్దకు వ్యాపారుల ఆటోలు వెళ్తున్నాయి. ప్రతి నెలా 15 వరకు రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు. కేజీకి రూ.10 వరకు ఇస్తున్నారు. ఆటోల ద్వారా సేకరించిన బియ్యాన్ని ఓ ప్రాంతంలో నిల్వ చేసి అక్కడి నుంచి లారీల్లో కర్ణాటకకు తరలిస్తున్నారు. ఒక్కలారీలో బియ్యం తరలిస్తే అన్ని ఖర్చులు పోను వ్యాపారికి రూ.50 వేలు మిగులుతోంది. ఇలా ఉమ్మడి జిల్లాలో రోజుకు రూ. కోటి మేర లావాదేవీలు జరుగుతున్నాయి.

తుమకూరు కేంద్రంగా..

ఉమ్మడి జిల్లాలో సేకరిస్తున్న బియ్యాన్ని కర్ణాటకలోని తుముకూరు తరలిస్తున్నారు. ఉరవకొండ, రాయదుర్గం ప్రాంతాల నుంచి బళ్లారికి కొంతమేర తీసుకెళ్తున్నారు. తుముకూరులో పెద్ద ఎత్తున రైస్ మిల్లులు ఉండటం.. సన్న బియ్యం గా మార్చే యంత్రాలు అందుబాటులో ఉండటంతో యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. అక్కడి వ్యాపారులకు కేజీ రూ.25 చొప్పున విక్రయిస్తున్నారు. సన్న బియ్యంగా మార్చి ఆకర్షణీయమైన బస్తాల్లో నింపి.. హిందూపురం, అనంతపురం, గుంతకల్లు పట్టణాల్లో కొందరు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. మడకశిర, రొళ్ల, అగళి, హిందూపురం ప్రాంతాల నుంచి కొందరు పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు. పావగడలోని మిల్లుల్లో వాటిని సన్నబియ్యంగా మారుస్తున్నారు. ఆకర్షణీయమైన బియ్యాన్ని తిరిగి బస్తాల్లో నింపి అనంతపురం పంపిస్తున్నారు. ఫిబ్రవరిలో మడకశిరలోని మధుగిరి మార్గంలో అక్రమంగా తరలిస్తున్న 165 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి: ఎయిరిండియా నిర్వాకం.. విమాన టికెట్‌పై టైం తప్పు పడటంతో..



Next Story

Most Viewed