ప్రజా గాయకుడు, డప్పు కళాకారుడు డప్పు రమేశ్ కన్నుమూత

by Disha Web Desk 4 |
ప్రజా గాయకుడు, డప్పు కళాకారుడు డప్పు రమేశ్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: నాలుగు దశాబ్దాల పాటు తన గొంతును, దరువును ప్రజా పోరాటాల కోసమే అంకితం చేసిన ప్రజా గాయకుడు, డప్పు కళాకారుడు డప్పు రమేశ్ ఇకలేరు. ఆయన వయసు 60 ఏళ్లు. శ్వాసకోశ సమస్యతో ఆయన శుక్రవారం విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్‌లో కన్నుమూశారు. గుంటూరు జిల్లా జూలకల్లు గ్రామంలో శనివారంఆయన అంత్యక్రియలు జరుగుతాయి. డప్పు రమేష్ అంతక్రియలు రేపు ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల దగ్గర స్వగ్రామం జూలకల్లులో ప్రారంభమవుతాయి.

నెల రోజుల క్రితమే తీవ్రమైన గుండె నొప్పితో హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చేరిన డప్పురమేష్ వారం రోజులక్రితం విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్ ఐసీయూలో చేరి చికిత్స చేయించుకుంటున్నారు. హైదరాబాద్‌ ఆసుపత్రిలో ఉండగానే పరిస్థితి విషమించిందని వైద్యులు అప్పుడే పెదవి విరిచినా నెలరోజులపాటు మృత్యువుతో పోరాడిన డప్పు రమేష్ ఇవాళ సాయంత్రం కన్నుమూశారు. పీపుల్స్ వార్ పార్టీకి నాటి ఏపీ ప్రభుత్వానికి మధ్య చర్చల సమయంలో బహిరంగ జీవితంలోకి అడుగుపెట్టిన డప్పు రమేష్.. 2004లో గుండె వ్యాధితో స్టెంట్ వేయించుకున్నారు. 2008లో ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చింది. అయినప్పటికీ ప్రజా కార్యక్షేత్రంలో వెనకడుగు వేయని డప్పు రమేష్.. తెలంగాణ మలి దశ ఉద్యమంలో కాలికి బలపం కట్టుకుని ఊరూ వాడా తిరుగుతూ తెలంగాణ ఆవిర్భావానికి అనుకూలంగా ప్రజాగానం చేశారు.

డప్పు రమేష్‌కు విప్లవ జోహార్లు

నాలుగు దశాబ్దాల నుండి పీడిత ప్రజల గుండె చప్పుడు జననాట్యమండలి విప్లవ గాయకుడిగా కోట్లాది ప్రజల పోరాట గీతంగా, డప్పు చప్పుడుగా చివరి వరకు నిలిచి అమరుడైన కామ్రేడ్ డప్పు రమేష్‌కు విప్లవ జోహార్లు. పీడిత వర్గం నుండి వచ్చిన కామ్రేడ్ రమేష్ డప్పు కొట్టినా, హావభావాలతో పాట పాడినా, అణగారిన పీడిత ప్రజల వర్గ కసి, ఆక్రందన ప్రజలను పోరాట వుత్తేజం నింపి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా బరిగీసి నిలిపే విధంగా వుండేది. నాలుగు దశాబ్దాలుగా దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో జరిపిన వేలాది మీటింగుల్లో తెలుగు, హిందీ, మరాఠీ, కోయ, కుయి వగైరా భాషల్లో విప్లవ పాటలు పాడుతూ ప్రజలను చైతన్యవంతం చేసిన గాయకుడు. పట్టణాలు మైదానాలు మాత్రమే కాకుండా దండకారణ్యం, ఏఓబి, ఒరిస్సా, జార్ఖండ్ అటవీ ప్రాంతంలోని ఆదివాసీ ప్రజలతో మమేకం అయి వారి భాషలో స్వయంగా పాటలు రాసి ఆడి పాడిన గొప్ప కళాకారుడు కామ్రేడ్ రమేష్ అమరత్వం ప్రజా ఉద్యమాలకు కమ్యూనిస్ట్ ఉద్యమానికి తీవ్రమైన నష్టం.

ప్రజల పాటలకు, కన్నీళ్లకు గొంతుక నిచ్చిన డప్పు రమేష్

నక్సలైట్ ఉద్యమ ప్రభావంతో సాంస్కృతిక రంగంలోకి దూకిన రమేశ్ ప్రజల కష్టాలను, కన్నీళ్లను ఉద్వేగభరితంగా పాడేవారు. స్వయంగా డప్పు కొడుతూ తెలుగు ప్రాంతాలన్నింటా తిరిగేవారు. జననాట్యమండలిలో చురుగ్గా పాల్గొన్న ఆయన 'కర్మభూమిలో పూసిన ఓ పువ్వా', 'ఒరే ఒరే కూలన్న ఇంక లేవరో', 'భారతదేశం భాగ్యసీమరా, పాడిపంటలకు కొదవలేదురా' వంటి ప్రజా గీతాలను అద్భుతంగా పాడేవారు. రమేశ్ కొన్నాళ్లు హైదరాబాద్‌లో నివాసం ఉన్నారు. అరెస్టులు, కేసులు ఎదుర్కొన్నారు. పలువురు రాజకీయ, సాంస్కృతిక రంగాల ప్రముఖులు ఆయన మృతికి నివాళి అర్పిస్తున్నారు.

ఎవరేమన్నారు?

వరుస విషాదాల నడుమ తెలుగు సమాజం.

మరో పాట మూగబోయింది.

జననాట్యమండలి పాటకు తన డప్పును, పాటను అందించిన డప్పు రమేష్ అన్న ఈ రోజు కన్నుమూశారు.

వేదికల మీద డప్పు రమేశన్న పాట అందుకుంటే అది డప్పుల దరువును తలపించేది. లలిత కళా తోరణంలో తెలంగాణ ధూమ్ ధాం సభలో రమేషన్న గొంతెత్తి పాడిన పాట ఇంకా వినిపిస్తూనే ఉంది. కొంత కాలంగా డప్పు రమేషన్న గుండె జబ్బుతో పోరాడారు. ఇలా మనల్ని వీడి వెళ్లిపోవడం బాధాకరం.

జోహార్లు రమేషన్న.

ప్రజల పాటల్లో

మాదిగ డప్పుల్లో నిన్ను చూసుకుంటాం...

- పసునూరి రవీందర్

.............................

డప్పు రమేష్ అరుణారుణ గానం అజరామరం

నాలుగు దశాబ్దాల మిత్రుడు, తెలుగు సీమ ఆ మూలనుంచి ఈ మూల దాకా తన అద్భుతమైన గానంతో, అర్థస్ఫోరకమైన అభినయంతో లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న ప్రజావిప్లవ గాయకుడు, జననాట్య మండలి నాయకుడు డప్పు రమేష్ గొంతు మూగవోయిందన్న విషాదవార్త. కానీ ఆ అరుణారుణ గానానికి మరణం లేదు. రమేష్‌కు కన్నీటి జోహార్లు.

-ఎన్ వేణుగోపాల్


డప్పు తన ఒంటి పేరుగా

డప్పు తన దేహంలో పేగుగా

నాలుగు దశాబ్దాలుగా పాటై ప్రవహించిన జలపాతం

నాభి నుండి

తన గుండె మూలల నుండి

చీల్చుకు వచ్చే దళిత పులులమ్మా గానం

అజరామరం

ఎన్నడూ రాజ్యానికి తలవంచని

విప్లవ గాన కేతనంగా రెపరెపలాడిన

రమేశన్నా సెలవంటూ నిష్క్రమించావా

వినమ్ర జోహార్లు పాటల విలుకాడా!!

(కుమార్ వర్మ ఫేస్ బుక్ నుంచి)


ప్రజా వాగ్గేయ కారుడు, సుప్రసిద్ధ ప్రజా కళాకారుడు, శరీర, అవయవ దానాల గురించి పాటలు పాడి క్యాసెట్ విడుదల చేసిన గాయకుడు, గత ఏడాది విశాఖలో సెప్టెంబర్ 10న "సురా సాహిత్య సామాజిక సేవా పురస్కారం" అందుకున్న డప్పు రమేష్" స్మృతికి అశ్రునివాళి!!

డాక్టర్ లక్ష్మీ సుహాసిని, గూడూరు

Next Story

Most Viewed