నీటికోసం నిరసన : రోడ్డుకి అడ్డంగా చెట్టు వేసి రైతుల ఆందోళన

by Disha Web Desk 21 |
నీటికోసం నిరసన : రోడ్డుకి అడ్డంగా చెట్టు వేసి రైతుల ఆందోళన
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కలవపాములలో రైతులు రోడ్డెక్కారు. సోమవారం ఉదయం గుడివాడ కంకిపాడు రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. ఒక పెద్ద చెట్టును రోడ్డుకు అడ్డంగా వేసి దానిపై కూర్చుని రైతులు నిరసన తెలిపారు. కలవపాముల లాకులు దగ్గర పంట పొలాలకు తక్షణమే నీళ్లివ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌లో వేసే పంటలు సరిగా దిగుబడి రాక ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు ఛాయలు అలుముకున్నాయని, ఇటువంటి పరిస్థితులలో కాలువల కింద, బోర్ల కింద వేసిన పంటలను ప్రభుత్వాధికారులు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితులలో నీళ్లు లేకపోతే పెట్టిన పెట్టుబడి అంతా రైతులు నష్టపోతారని అన్నారు. వారంతా సన్న చిన్నకారు, కౌలు రైతులేనని తక్షణమే నీళ్లు విడుదల చేయాలని కోరారు. అయితే రైతులు రోడ్డుపై ఆందోళన చేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. అయితే తమకు న్యాయం జరిగే వరకు నిరసనను ఆపేది లేదని రైతులు చెప్తున్నారు. దీంతో ప్రయాణికులు నడిరోడ్డుపై పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది.


Next Story

Most Viewed