రాజధాని రైతుల సమస్యలు | నేడు త్రిసభ్య కమిటీ సమీక్ష

by Thanuru Gopichand |   (  Updated:2025-11-22 04:55:06  IST  )

రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు నేడు (శనివారం) సీఆర్డీఏ (CRDA) కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమీక్ష జరగనుంది.

రాజధాని రైతుల సమస్యలు | నేడు త్రిసభ్య కమిటీ సమీక్ష
X

దిశ, వెబ్ డెస్క్ : రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు నేడు (శనివారం) సీఆర్డీఏ (CRDA) కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమీక్ష జరుగుతోంది. గుంటూరు ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్ర, రాష్ట్ర పురపాలక, పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, తెనాలి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, రైతు జేఏసీ ప్రతినిధులు సమావేశమై రాజధాని రైతుల సమస్యలపై చర్చిస్తున్నారు. భూముల రిజిస్ట్రేషన్, అభివృద్ధి పనులు వంటి వాటిపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే రైతు జేఏసీ ప్రతినిధులతో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సమావేశమయ్యారు. వారి సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తామని తెలిపారు. అందుకు గానూ ప్రభుత్వం చర్చించనున్నట్లు రైతులకు హామీనిచ్చారు.

శుక్రవారం రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ కూడా అమరావతిలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. అమరావతిలో (Amaravathi) సిటీస్ ప్రాజెక్ట్ క్రింద 15 అంగన్వాడీ భవనాలు, 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాలు, 14 పాఠశాలలు, ఒక మల్టీ పర్పస్ శ్మశాన వాటికను నిర్మించామని పేర్కొన్నారు. వాటి ద్వారా రాజధాని పరిధిలోని గ్రామాల్లో నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు అందుతాయని తెలిపారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు ఎవరికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. రానున్న మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని ప్రకటించారు. మొత్తం 69,421 మంది రైతులకు ఇప్పటి వరకు 61,433 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని చెప్పారు. మరో 2,270 మంది రైతులకు 7,988 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు.

Next Story