ఈ సంక్రాంతికి మీ జేబులు ఖాళీ.. హైదరాబాద్ టు విజయవాడ టికెట్ రేటెంతో తెలిస్తే షాకే

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-04 03:46:02  IST  )

"ఊరెళ్లిపోతా మామ.. ఊరెళ్లిపోతా మామ.. ఎర్రబస్సెక్కి నేను సంక్రాంతికి పోతా మామ" అని సంక్రాంతికి ఊరెళ్లేందుకు రెడీ అవుతున్నావా?

ఈ సంక్రాంతికి మీ జేబులు ఖాళీ.. హైదరాబాద్ టు విజయవాడ టికెట్ రేటెంతో తెలిస్తే షాకే
X

దిశ, వెబ్‌డెస్క్: "ఊరెళ్లిపోతా మామ.. ఊరెళ్లిపోతా మామ.. ఎర్రబస్సెక్కి నేను సంక్రాంతికి పోతా మామ" అని సంక్రాంతికి ఊరెళ్లేందుకు రెడీ అవుతున్నావా? మరి టికెట్లు బుక్ చేసుకున్నావా? ఇప్పటి వరకూ చేసుకోకపోతే మాత్రం నీ జేబుకు చిల్లు పడటం ఖాయం. ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు ఆల్రెడీ ఫుల్ అయ్యాయి. ట్రైన్లైతే చెప్పనక్కర్లేదు. స్లీపర్, టూ టైర్, త్రీ టైర్, ఫస్ట్ క్లాస్ ఏసీల్లో కూడా రిజర్వేషన్ చేసుకునే వీల్లేదు. ఏ ట్రైన్ రిజర్వేషన్ ఓపెన్ చేసినా రిగ్రెట్ చూపిస్తోంది. తత్కాల్ లో రిజర్వేషన్ చేసుకోవచ్చా అంటే.. అది కత్తి మీద సాములాంటిది. సరిగ్గా ఆ టైమ్ లోనే IRCTC యాప్ హ్యాండ్ ఇస్తుంది. సర్వర్ డౌన్ అవ్వడం, పేమెంట్ ఫెయిల్ అవ్వడం జరుగుతాయి. రెండంటే రెండే నిమిషాల్లో తత్కాల్ టికెట్లు కూడా హాట్ కేకుల్లా అయిపోతాయి. ఇక మిగిలిన ఆప్షన్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు.

అడ్డంగా దోచుకుంటున్న ట్రావెల్స్

సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండుగలు వస్తే చాలు. దొరికిందే సందు అన్నట్లుగా టికెట్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచేస్తాయి. సాధారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సు ఛార్జీ రూ.700 ఉంటుంది. కానీ.. పండుగ పేరు చెప్పి ఈ టికెట్ ను రూ.2700 నుంచి రూ.4000 వరకూ పెంచేశారు. నలుగురు సభ్యులున్న ఒక ఫ్యామిలీ ఊరెళ్లాలంటే రూ.10,000 నుంచి రూ.16,000 వెళ్లేందుకే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. తిరిగి వచ్చేటపుడు కూడా ట్రావెల్స్ బస్సులు ఓన్లీ వన్ ఆప్షన్ అయితే.. మళ్లీ అదేస్థాయిలో టికెట్ల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. పైగా బస్సులో ఒక్కో సీటు/బెర్త్ కు ఒక్కో రేటు ఉంటుంది. ఆదాయమే లక్ష్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా.. ఓపెన్ గానే దోచుకుంటుంటే ప్రభుత్వాలు వీటిపై స్పందించకపోవడం గమనార్హం. పండుగ సీజన్లలో ట్రావెల్స్ బస్సుల్లో టికెట్ రేట్ల పెంపుకు ఒక లిమిట్ విధించి, దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ టికెట్ రేట్లతో.. సంక్రాంతి పండక్కి దాచుకున్న డబ్బులన్నీ టికెట్లకే ధారపోయాల్సి వస్తోందని మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. పండుగ ముందు ఎన్ని స్పెషల్ బస్సులు, రైళ్లు నడిపినా.. వాటితో ప్రయాణికుల అవసరాలు తీరడం లేదన్నది వాస్తవం.

Next Story