మార్చి నాటికి పోలవరం డయాఫ్రామ్ వాల్ పూర్తి

by Thanuru Gopichand |

అంతర్జాతీయ నిపుణుల సూచనలతో వేగంగా నిర్మాణ పనులు.

మార్చి నాటికి పోలవరం డయాఫ్రామ్ వాల్ పూర్తి
X

దిశ, వెబ్ డెస్క్ : పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పనులను వేగవంతం చేసే క్రమంలో భాగంగా అంతర్జాతీయ నిపుణుల బృందం (International Experts Team) కీలక సూచనలు చేసింది. మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజైన మంగళవారం ప్రాజెక్టులోని ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా గ్యాప్-1, గ్యాప్-2 ప్రధాన ఆనకట్ట పనులలో రోలింగ్ కార్యకలాపాల కోసం 'షీప్ ఫూట్ రోలర్ల'ను (Sheep Foot Rollers) వినియోగించాలని బృందంలోని నిపుణులు సిఫార్సు చేశారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ఫ్లాట్, వైబ్రేటరీ రోలర్ల కంటే, డయాఫ్రామ్ వాల్‌కు ఆనుకుని ఉండే ప్లాస్టిక్ క్లే కోర్ జోన్‌లలో ఈ షీప్ ఫూట్ రోలర్లు అత్యంత ఆవసరం అని వారు స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ తరహా రోలర్లు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయని, ప్రాజెక్టు పటిష్టతకు ఇవి తోడ్పడతాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.

తిరుపతి నిపుణుల సహకారంతో

​ఈ బృందం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులను కూడా క్షుణ్ణంగా పరిశీలించింది. గతంలో డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలో ఎదురైన బ్లీడింగ్ సమస్యలకు ఐఐటీ తిరుపతి నిపుణుల సహకారంతో అభివృద్ధి చేసిన కొత్త పద్ధతి ద్వారా శాశ్వత పరిష్కారం లభించిందని అధికారులు వెల్లడించారు. ఈ సరికొత్త మెథడాలజీతో పనులు ఆటంకం లేకుండా సాగుతున్నాయని, ఫిబ్రవరి, మార్చి నాటికి డయాఫ్రామ్ వాల్ పనులన్నీ పూర్తవుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. నిపుణుల బృందం స్వయంగా గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతాల్లో రోలింగ్ పనులను పర్యవేక్షించడంతో పాటు, డీ-హిల్ గ్రౌటింగ్ పనులను కూడా పరిశీలించిందని వారు పేర్కొన్నారు.

ఇది 6వ సారి..

​అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించడం ఇది ఆరోసారి. షీన్ హించ్‌బెర్గర్, డేవిడ్ బి. పాల్, జియాన్ ఫ్రాంకో డి సిక్కో వంటి ప్రపంచస్థాయి డ్యామ్ సేఫ్టీ నిపుణులతో కూడిన ఈ బృందం ప్రాజెక్టు నాణ్యత, భద్రత విషయంలో రాజీ పడకుండా సూచనలు చేస్తోంది. ఈ పర్యటనలో భాగంగా వారు ప్రధాన డ్యామ్ ఎగువ, దిగువ భాగాలు, రాక్ ఫిల్ జోన్లు, క్లే స్టాక్‌యార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకోగా నిపుణుల తాజా సూచనలు పనుల నాణ్యతను మరింత పెంచుతాయని అధికారులు భావిస్తున్నారు.

Next Story