రాజధాని రైతులకు ఈ-లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు

by Thanuru Gopichand |

రాజధాని రైతులకు ఈ-లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు
X

దిశ, వెబ్ డెస్క్ : రాజధాని అమరావతి (Amaravati) అభివృద్ధిలో భాగంగా భూములిచ్చిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) తీపి కబురు అందించింది. ఈ నెల 23న ఈ-లాటరీ (E-Lottery) విధానం ద్వారా రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించనున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Narayana) వెల్లడించారు. గతంలో భూసమీకరణ కింద భూములిచ్చి, ప్లాట్ల కేటాయింపు పెండింగ్‌లో ఉన్న వారందరికీ ఈ ప్రక్రియ ద్వారా న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్లాట్లు పొందిన వెంటనే రైతులకు రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. ఇందుకోసం అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు.

​ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) పరిధి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 8వేల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉందని మంత్రి నారాయణ వివరించారు. రాజధాని నిర్మాణ అవసరాలు మరియు భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, జూలై 2025లో సీఆర్డీఏ అథారిటీ మరో కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా అమరావతి, తుళ్లూరు మండలాల్లోని 7 గ్రామాల్లో అదనంగా 20,494 ఎకరాలను భూసమీకరణ (Land Pooling) ద్వారా సేకరించినట్లు ఆయన తెలిపారు. ఈ అదనపు భూమిని మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టుల కోసం వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని మంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

Next Story