ఇచ్చిన మాట ప్రకారం ఒకరోజు ముందే పెన్షన్ : హోం మంత్రి

by Thanuru Gopichand |

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. సీఎం చంద్రబాబు నాయకత్వంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్.

ఇచ్చిన మాట ప్రకారం ఒకరోజు ముందే పెన్షన్ : హోం మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి (Anitha Vangalapudi) అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను (NTR Bharosa) పంపిణీ చేసిందన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని ఎస్.రాయవరం మండలం సోముదేవుపల్లిలో (Somudevupalli) మంత్రి శనివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇంటింటికి వెళ్లారు. లబ్ధిదారులను స్వయంగా కలిసి వారికి పెన్షన్ ను అందజేశారు. మంత్రి స్వయంగా వచ్చిన పెన్షన్ ఇవ్వడంతో గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉన్నత హోదాలో ఉండి కూడా సాధారణ వ్యక్తిలాగా ఆమె చేస్తున్న సేవను అభినందించారు. ఒకరోజు ముందుగానే పింఛన్ అందడంతో వారి కళ్లలో సంతోషానికి అవధుల్లేకుండా పోయింది.

అదే విధంగా సోముదేవుపల్లి వద్ద ఉన్న వరాహ నదికి (Varaha River) రక్షణ గోడ నిర్మించాలని చాలా కాలంగా గ్రామస్తులు కోరుతున్నారు. వారి వినతిని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి హోం మంత్రి అనిత తీసుకెళ్లారు. ఈ క్రమంలో రూ.10 కోట్ల నిధులు నది తీరంలో రక్షణ గోడ (Retining Wall) నిర్మాణానికి మంజూరయ్యాయి. దీంతో గ్రామస్తులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి అనిత మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను ఎల్లప్పుడూ పరిష్కరించడానికి ముందుంటుందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తోందని తెలియజేశారు.

Next Story