- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్

దిశ, వెబ్‌డెస్క్: మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. క్షేత్ర సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహ స్వామి వారిని దర్శించుకుని శ్రీవారి ఆలయం వద్దకు విచ్చేసిన ఆయనకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, క్యాలెండర్, పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తితో మారిషస్ దేశాభివృద్ధి
సంస్కృతి, సంప్రదాయం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని మారిషస్ దేశాన్ని అభివృద్ధి చేసేందుకు విశేష కృషి చేస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తెలిపారు. తిరుమలలోని ధర్మగిరిలో ఉన్న శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించారు. ముందుగా వేద విజ్ఞాన పీఠం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
అనంతరం వేద పాఠశాలలోని ఆనంద నిలయంలో శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీ గోదాదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని మారిషస్ దేశాధ్యక్షుడికి స్వాగతోపాన్యాసం చేశారు. వేద పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు సామూహిక వేద పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం చరిత్రను మారిషస్ దేశాధ్యక్షుడికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను అధ్యాపక వృత్తి నుండి మారిషస్ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని తెలిపారు. సమాజంలో ఉపాధ్యాయులకు ఎనలేని గౌరవం ఉందని, ఆధునిక సమాజ అభివృద్ధికి ఉపాధ్యాయులు తోడ్పడతారని పేర్కొన్నారు.
ప్రపంచ తెలుగు మహాసభలకు విచ్చేసిన సందర్భంగా తిరుమల శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకోవడం జరిగిందన్నారు. వసుదైక కుటుంబకమైన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాంస్కృతిక, సాంప్రదాయ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని మారిషస్ దేశాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు. అతిథులను గౌరవించడంలో, స్వాగతం పలకడంలో భారతీయులు ముందంజలో ఉంటారని చెప్పారు. మారిషస్ దేశంలో నిర్మిస్తున్న హరిహర దేవస్థానంలో టీటీడీ సలహాలు, సూచనలతో వేద పాఠశాల ఏర్పాటు చేయడానికి నిర్ణయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, సీవీఎస్ఓ మురళీకృష్ణ , జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.






