కొత్తగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ ఏర్పాటు.. ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

by Ramesh Naini |

రాష్ట్రంలో ‘సైన్స్‌, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌’ పేరుతో కొత్త శాఖను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కొత్తగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ ఏర్పాటు.. ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం, రాష్ట్రంలో ‘సైన్స్‌, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌’ పేరుతో కొత్త శాఖను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో పాటు ఐటీ రంగంలో కీలకమైన సెమీకండక్టర్‌ పరిశ్రమను విశాఖపట్నంలో రూ.2,387 కోట్లతో నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

పర్యాటక, విద్యుత్ రంగాలకు ఊతం

రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు విశాఖ, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, సత్యసాయి జిల్లా, చీరాలలో భారీ పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్‌ అనుమతులిచ్చింది. అలాగే, ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో సౌర, పవన మరియు హైబ్రిడ్‌ విద్యుత్ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తీసుకున్న నిర్ణయాలకు కూడా మంత్రివర్గం అంగీకారం తెలిపింది.

ప్రజారోగ్యంపై సర్కార్ సీరియస్

రాజమండ్రిలో తాజాగా వెలుగుచూసిన పాల కల్తీ వ్యవహారం, శ్రీకాకుళంలో ప్రబలిన డయేరియా ఘటనలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులను ఆదేశించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

అసెంబ్లీ వేదికగా సాగు రంగంపై చర్చ

శాసనసభలో బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు వివిధ అంశాలపై లఘు చర్చలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యంగా సాగు రంగంపై ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ చర్చలో సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారని వెల్లడించారు.

మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు..

అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొత్త పారిశ్రామిక ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం.

ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ.

వివిధ సంస్థలకు భూకేటాయింపుల ప్రక్రియకు అనుమతి.

కొల్లేరు అభయారణ్యం సరిహద్దుల సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి, కేంద్రానికి పంపాలని నిర్ణయం.

Next Story