- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా అనుభవమే అందుకు ప్రేరణనిచ్చింది : మంత్రి సత్యకుమార్ యాదవ్
క్యాన్సర్ నివారణపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

దిశ, వెబ్ డెస్క్ : క్యాన్సర్ కారణంగా తల్లితోపాటు సోదరిని కోల్పోయాను.. నాకున్న ఆ అనుభవమే క్యాన్సర్ రంగంలో నిబద్ధతతో పని చేయడానికి ప్రేరణ ఇచ్చిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satya Kumar Yadav) అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని (World Cancer Day) పురస్కరించుకొని మహాత్మాగాంధీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన వాకథాన్ ను (Cancer Awareness Walkathon) విశాఖపట్నంలో ఆదివారం నిర్వహించారు. గుడ్ మార్నింగ్ వైజాగ్ - గుడ్ బై క్యాన్సర్ నినాదంతో విశాఖ బీచ్ వద్ద నిర్వహించిన కార్యక్రమాన్ని మంత్రి ముఖ్య ఆహ్వానితులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖవాసులతో కలిసి బీచ్ వద్ద క్యాన్సర్ పై సమిష్టి పోరాటంలో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
జాతీయ సగటుతో పోల్చితే ఎక్కువ
వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తాను మొదటగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కు సంబంధించిన ఫైల్ పై సంతకం చేశానన్నారు. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నివారించే అవకాశం ఉందన్నారు. అందుకే అవగాహన, స్క్రీనింగ్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. జాతీయ సగటుతో పోల్చితే రాష్ట్రంలో క్యాన్సర్ కేసుల పెరుగుదల ఎక్కువగా ఉందన్నారు. అందుకే వ్యాధి నియంత్రణకు ప్రివెన్షన్ విధానాన్ని దృఢ సంకల్పంతో అమలు చేస్తున్నామని వెల్లడించారు. పట్టణాలు, గ్రామాల్లోని ఇండ్లకు ఆరోగ్య సిబ్బంది వెళ్లి మరీ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా స్క్రీనింగ్ టెస్టులను కూడా చేస్తున్నారన్నారు.
NCD-4.0 కార్యక్రమం ద్వారా పరీక్షలు
నాన్ కమ్యూనికబుల్ డిసీస్ (NCD-4.0) కార్యక్రమం కింద ప్రమాణాలకు అనుగుణంగా అవసరమైన వారికి ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలను ప్రాథమిక స్థాయిలో చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఓరల్ క్యాన్సర్ పరీక్షలు 1,39,97,523 మందికి, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు 73,78,836 మందికి, సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు 73,78,836 మంది మహిళలకు నిర్వహించామని ప్రకటించారు. హోమీభాభా క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో 18 వేల మంది ఆరోగ్య సిబ్బందికి స్క్రీనింగ్ విధానాలపై ప్రత్యేక శిక్షణ అందించామన్నారు. NCD–3.0 ద్వారా వచ్చిన ఫలితాలు సంతృప్తికరంగా లేనందున, మరింత సమర్థవంతంగా NCD–4.0 ద్వారా మళ్లీ పరీక్షలు చేపట్టామని తెలియజేశారు.
ఉచితంగా వ్యాక్సిన్ అందించేందుకు చర్యలు
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ (HPV) వ్యాక్సిన్‌ను బాలికలకు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, నిర్దిష్ట ప్రమాణాల మేరకు ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేయనున్నామని మంత్రి వెల్లడించారు. మహిళలు భయం, అపోహలు విడిచిపెట్టి సర్వైకల్ పరీక్షలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ రాజీ పడదు
క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆధునిక పరికరాలను సమకూర్చే విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడదని మంత్రి స్పష్టం చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో లెవల్–1 క్యాన్సర్ కేర్ సెంటర్, విశాఖ కేజీహెచ్‌లో లెవల్–2 క్యాన్సర్ కేర్ సెంటర్, కర్నూలు జీజీహెచ్‌లో రూ.120 కోట్లతో రాష్ట్ర స్థాయి క్యాన్సర్ సెంటర్, కడప క్యాన్సర్ సెంటర్ ద్వారా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. అలాగే విశాఖ కేజీహెచ్‌లో పీఈటీ (PET) స్కాన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
క్యాన్సర్ పై విజయం సాధించాలి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో హెల్దీ – వెల్తీ – హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే కూటమి ప్రభుత్వం సంకల్పమని మంత్రి తెలిపారు. క్యాన్సర్ నివారణలో ముందస్తు పరీక్షలు, అవగాహన, సమయానికి చికిత్సే కీలకమన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని క్యాన్సర్‌పై విజయం సాధించాలని కోరారు.






