- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLC: పవన్ కల్యాణ్ గొప్ప నాయకుడు
ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టిపెట్టిన గొప్ప నాయకుడు పవన్ కల్యాణ్ అని ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: అభివృద్ధిలో పరుగులు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్థిరంగా నిలబడాలని, కూటమిలో సర్దుబాటు కోసం కొంతమందికి త్యాగాలు చేయాల్సిన బాధ్యత ఉంటుందని, దానికి తాను కూడా ఒక ఉదాహరణ అని, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్(Pawan Kalyan) వ్యక్తిగతంగా కోల్పోయినవి మరెన్నో అని జనసేన(Janasena Party) ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు కే.నాగబాబు(Nagababu) స్పష్టం చేశారు. ఎన్.ఆర్.ఐ. జనసేన శ్రేణులతో సోమవారం జరిగిన వర్చువల్ సమావేశంలో నాగబాబు మాట్లాడారు. పార్టీ కోసం పని చేసే ప్రతీ ఒక్కరికీ కొద్దిగా ఆలస్యం అయినా తప్పనిసరిగా అవకాశాలు వస్తాయని చెప్పారు. బలమైన పరిపాలన అందిస్తున్న కూటమి కలయిక సుదీర్ఘ కాలం ఉండాలని ప్రజలు భావిస్తున్నారని, గతంలో దేశంలోనే 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖను పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఒకటిన్నర సంవత్సరంలోనే మొదటి స్థానంలోకి తీసుకొచ్చిన ఘనతను సొంతం చేసుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వం అయిదేళ్లలో రోడ్ల కోసం కనీసం రూ.100 కోట్లు కూడా వెచ్చించలేకపోయారని, ప్రజల ధనం ప్రజల కనీస అవసరాలకు ప్రథమ ప్రాధాన్యంగా ఖర్చు చేయాలనే సదుద్దేశంతో పవన్ కల్యాణ్ గ్రామీణ ప్రాంతాలను, మండలాలను, జిల్లాలను అనుసంధానం చేసే రహదారుల కోసం రూ. 1000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు చెప్పారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టిపెట్టిన గొప్ప నాయకుడు పవన్ కల్యాణ్ అని తెలిపారు.
NRI జనసేన శ్రేణుల సహకారం అభినందనీయం
అమరజీవి జలధార ద్వారా ఐదు జిల్లాల పరిధిలో, రానున్న 35 ఏళ్లలో 1.21 కోట్లమంది దాహర్తి తీర్చాలని పవన్ కల్యాణ్ సంకల్పించారని, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీరప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ శాతం తీర ప్రాంతాలను కలిపేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం అమరుడైన పొట్టి శ్రీరాములుని సదా స్మరించుకోవాలనే ఉద్దేశంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు “అమరజీవి జలధార”గా నామకరణం చేశారని అన్నారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, సంక్షేమం, అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు నిదర్శనమని అన్నారు. 2024 ఎన్నికల సమయంలో ఎన్.ఆర్.ఐ. జనసేన శ్రేణుల సహకారం చాలా అభినందనీయమని, ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కోసం పని చేసిన ప్రతీ ఎన్.ఆర్.ఐ.కు ఈ సందర్భంగా పార్టీ తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. అనిశెట్టి స్వామి నెల రోజులకు పైగా ఇక్కడే ఉండి ఎన్.ఆర్.ఐ.లను సమన్వయం చేస్తూ సమష్టిగా కూటమి విజయం కోసం పని చేసిన తీరు ఎన్నటికీ మరువలేనిదని చెప్పారు. ఇదే సమన్వయంతో భవిష్యత్తులో పార్టీ బలోపేతం కోసం, ప్రజలకు బాధ్యతాయుతమైన జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందించేందుకు కలిసికట్టుగా పనిచేద్దాం అని వెల్లడించారు. యూ.ఎస్.ఏ. నుంచి పార్టీకి సహకారం అందిస్తున్న ప్రతీ ఒక్కరినీ నాగబాబు పేరుపేరునా పలకరించి అభినందనలు తెలిపారు.






