మంత్రి చొరవ.. అడిగిన వెంటనే రోడ్డు పనులు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-13 06:54:09  IST  )

కర్లపూడిలో రెట్టింపైన సంక్రాంతి సంబరాల ఉత్సాహం.

మంత్రి చొరవ.. అడిగిన వెంటనే రోడ్డు పనులు
X

దిశ, వెబ్ డెస్క్ : రాజధాని అమరావతి (Amaravati) ప్రాంతంలో ఉన్న కర్లపూడి (karlapudi) గ్రామంలో ఎట్టకేలకు రోడ్డు మంజూరైంది. దీంతో గ్రామస్తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం నుంచి రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. పనులకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minster Ponguru Narayana) శంకుస్థాపన చేశారు. అయితే గ్రామస్తులు అడిగిన ఒక్క రోజు వ్యవధిలోనే రోడ్డు పనులు మంజూరు కావడం పట్ల కర్లపూడివాసులు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ల్యాండ్ పూలింగ్ కోసం కర్లపూడి గ్రామానికి మంత్రి పొంగూరు నారాయణ సోమవారం వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మంత్రి మాట్లాడారు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని వారు మంత్రిని కోరారు. దీనిపై నిర్ణయం తీసుకున్న మంత్రి నారాయణ రోడ్డు వేయించాలని నిర్ణయించుకున్నారు. రైతులు అడిగిన వెంటనే కాంట్రాక్ట్ సంస్థకు పనులను అప్పగించి రోడ్డును మంజూరు చేశారు. మంగళవారం పనులకు స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అదే విధంగా వారంలోగా రోడ్డు పనులను ప్రారంభించాలని సంస్థను ఆదేశించారు. అడిగిన వెంటనే పనులు ప్రారంభం కావడం, సంక్రాంతి పండుగ నేపథ్యంలో గ్రామంలో పండగ వాతావరణం మరింత సందడిగా మారింది.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి అభివృద్ధి జరగాలంటే ఇన్నర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ సిటీ అవసరం అన్నారు. 80 శాతం ల్యాండ్ పూలింగ్ పూర్తవ్వగానే మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసి టెండర్లను పిలుస్తామన్నారు. రైతులకు ఇచ్చే ప్లాట్లలో ముందుగా రోడ్లను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పలు ప్రాజెక్టుల కోసం ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని వెల్లడించారు.

Next Story