- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు అలర్ట్.. గత ప్రభుత్వ రీసర్వే అంతా తప్పుల తడకలే: మంత్రి అనగాని సెన్సేషనల్ కామెంట్స్
గత ప్రభుత్వ హయాంలో జరిగిన సర్వేలో అనేక లోపాలు ఉన్నాయని గుర్తిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలగకుండా "రీసర్వే 2.0" పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఈ క్రమంలో రీసర్వే గడువును కూడా పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో భూముల రీసర్వేపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సర్వేలో అనేక లోపాలు ఉన్నాయని గుర్తిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలగకుండా "రీసర్వే 2.0" పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఈ క్రమంలో రీసర్వే గడువును కూడా పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు.
90 రోజుల నుంచి 143 రోజులకు పెంపు
భూముల సర్వే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, కచ్చితత్వంతో జరగాలన్న ఉద్దేశంతో రీసర్వే కాలాన్ని 90 రోజుల నుంచి 143 రోజులకు పెంచినట్లు మంత్రి తెలిపారు. రైతుల సంపూర్ణ భాగస్వామ్యంతో, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో జరిగిన రీసర్వేపై మంత్రి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ సర్వే అస్తవ్యస్తంగా సాగడం వల్ల ప్రజల నుంచి ఏకంగా 7.5 లక్షల ఫిర్యాదులు అందాయని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం ఇచ్చిన పాసు పుస్తకాల్లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రియల్ టైమ్ డేటా కనిపించడం లేదని విమర్శించారు.
రీసర్వే 2.0 ప్రత్యేకతలు
ప్రస్తుత ప్రభుత్వం జారీ చేసే పట్టాదారు పాసు పుస్తకాల్లో అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నట్లు మంత్రి వివరించారు. కొత్త పాసు పుస్తకాలపై ప్రభుత్వ అధికారిక రాజముద్ర ఉంటుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే భూమికి సంబంధించిన రియల్ టైమ్ డేటాతో పాటు, సదరు భూమి ఎక్కడుందో చూపే నావిగేషన్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే పురోగతిని వివరిస్తూ.. ఇప్పటికే మూడు దశల్లో 2,097 గ్రామాల్లో సర్వే పూర్తయ్యిందని, ప్రస్తుతం నాలుగో దశలో 1,613 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రైతులకు ఎక్కడా అన్యాయం జరగకుండా పూర్తి స్థాయి కచ్చితత్వంతో భూహక్కులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.






